Weather in AP: ఠారెత్తించిన ఎండ
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:43 AM
వేసవిలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, కోస్తా, రాయలసీమలో ఉక్కపోతతో వర్షాలు కురిశాయి.

తిరుపతిలో 43.6 డిగ్రీలు
ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ర్ణోగ్రత
పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. రాయలసీమలో గాలిలో తేమశాతం తగ్గడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. కోస్తాలో కొన్నిచోట్ల సముద్రం నుంచి వచ్చే గాలులతో తేమశాతం పెరిగి ఉక్కపోత నెలకొంది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత, ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వేసవిలోనే తొలిసారి తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ఠ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, నంద్యాల జిల్లా అవుకులో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 42.4, పల్నాడు జిల్లా వినుకొండ, కడప జిల్లా ఉప్పలూరులో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ఉపరితలద్రోణి, ఎండ తీవ్రత ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న ఐదు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రత కొనసాగి పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 31 మండలాల్లో తీవ్రంగా, 20 మండలాల్లో మోస్తరుగా వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.