Share News

Pawan Kalyan On Teachers Parents Meeting: ఇలాంటివి పట్టించుకోవద్దు.. మన బలమైన ఆయుధం ఇదే..

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:44 PM

తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.

Pawan Kalyan On Teachers Parents Meeting: ఇలాంటివి పట్టించుకోవద్దు.. మన బలమైన ఆయుధం ఇదే..
Pawan Kalyan On Teachers Parents Meeting

పల్నాడు జిల్లా: చిలకలూరిపేట ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రసంసించారు. మైలవరపు కృష్ణ తేజ తాతగారు గుండయ్య పేరుతో కూడలి ఉండటం ఆయన సేవా నిరతిని గుర్తు చేసిందన్నారు. అప్పట్లో పెద్దలు పాఠశాలలకు స్థలాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు కొందరు స్థలాలు లాక్కుంటున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు.


అద్భుతంగా ఉంది

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాల గురించి మాట్లాడారు. పిఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు అంటగట్టారని మండిపడ్డారు. కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లల బలాబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనదని, తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం 67 లక్షల మందికి అందించినట్లు తెలిపారు. పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందని, వారు తయారు చేసిన పరికరాలు నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.


చేయూత అందించాలి

స్కూల్ క్రీడా మైదానం సరిపోవడం లేదని విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని, క్రీడా మైదానం సమకూర్చే విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించాలని అన్నారు. గ్రంధాలయంలో పిల్లల సంఖ్యకు సరిపడా పుస్తకాలు లేవని, తన వైపు నుంచి పూర్తి స్థాయి గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలు అందిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పిల్లల ఆలోచనలు మెరుగు పర్చటానికి లైబ్రరీ ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంధాలయాల ఏర్పాటుకు జనసేన నేతలు, కార్యకర్తలు చేయూత అందించాలని కోరారు. పాఠశాలలో పది కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయని, తన వైపు నుంచి 25 కంప్యూటర్లు పంపిస్తానని స్పష్టం చేశారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య చాలా ముఖ్యమన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పౌషకాహారం చాలా అవసరమని వివరించారు.


బాధ్యత ఉపాధ్యాయులదే

చదువు చాలా బలమైన ఆయుధమని, లక్ష మెదల్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని అన్నారు. ఏ మాధ్యమంలో చదివామనేది ముఖ్యం కాదని.. విభిన్న అంశాలపై పట్టు సాధించడం ముఖ్యమని సూచించారు. అబ్దుల్ కలాం వంటి వారు తమిళ మాద్యమంలో చదివి మిసైల్ మ్యాన్‌గా, రాష్టపతిగా ఎదిగారని గుర్తుచేశారు. చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన అంశాలు తనన్ను ఇప్పుడు బలంగా నిలబెట్టాయన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు.


పట్టించుకోవద్దు

మన జీవితాలను మార్చిన శాస్త్రవేత్తలను గుర్తు పెట్టుకుని గౌరవించటం తన తల్లి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థులోనూ నిగూఢమైన శక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులను పట్టించుకోవద్దని, సినిమా కూడా చిన్న వినోదం మాత్రమేనని అన్నారు. మీ ఆలోచనలు, ప్రవర్తన మన దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తాయన్నారు. స్థలాలు లాక్కునే వారి వల్లే పిల్లలకు క్రీడా మైదానాలు దొరకటం లేదని, స్కూల్ గ్రౌండ్ ఏర్పాటు విషయం అధికారులు త్వరగా ఆలోచించాలని సూచించారు.


వీటిని దొంగిలించలేరు

ఈ క్రమంలోనే, మాదకద్రవ్యాలతో తీవ్ర అనర్థం జరుగుతుందని, యువత అటు వైపు అస్సలు చూడొద్దని కోరారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. గుంటూరు శేషేంద్ర శర్మ విద్యార్థుల భవిష్యత్తుపై రాసిన మాటలు స్ఫూర్తినిచ్చాయన్నారు. మనం సంపాదించినవి పోవచ్చు.. కానీ చదువు, జ్ఞానం ఎప్పటికి పోవని, వాటిని ఎవరూ దొంగిలించలేరని పేర్కొన్నారు. స్వయం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు చెబితే ఎందరో సమర్థులు తయారవుతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.


Also Read:

పళనిలో తెలుగు భక్తుడిపై దాడి..

చంద్రబాబు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం

For More Latest News

Updated Date - Dec 05 , 2025 | 02:01 PM