Share News

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ విడుదల..

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:35 PM

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 2030 నాటికి రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ డిక్లరేషన్‌ ప్రకటించారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ విడుదల..
CM Chandrababu

అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ ప్రకటించారు. ఇటీవల అమరావతిలో జరిగిన రెండ్రోజుల గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో చర్చించిన అంశాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ఈ డిక్లరేషన్ ప్రకటించింది. అమరావతిలో ఏడు సెషన్స్‌గా జరిగిన ఈ సమ్మిట్‌లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు సహా 600 మంది నిపుణులు పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి ప్రయోగాలు, సాంకేతికత, పెట్టుబడులపై చర్చలు జరిగాయి.


భారత్‌లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు విధివిధానాలు రూపొందించేలా ఈ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెలకొల్పటమే డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.

2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా చేసుకుంది ఏపీ సర్కార్. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అదే ఏడాది నాటికి కిలో హైడ్రోజన్ గ్యాస్ రూ.460 నుంచి రూ.160కి తగ్గించేలా కార్యాచరణ రూపొందించారు. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేశారు.


ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం

గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పరిశోధనల కోసం ప్రభుత్వం రూ.500కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ రంగంలో ముందడుగు వేసే 50 స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

భవిష్యత్తు దిశగా అడుగులు

ఈ డిక్లరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు దారితీసే మోడల్ స్టేట్‌గా ఏపీని నిలిపేందుకు ఇది బలమైన అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read:

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

For More Andhra Pradesh News

Updated Date - Jul 21 , 2025 | 04:36 PM