AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ఈసారి ఏయే అంశాలు చర్చిస్తారంటే..
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:38 PM
ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ (Andhra Pradesh Cabinet Meeting) మరోసారి భేటీ కానుంది. రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం (AP Secretariat)లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈసారి జరిగే క్యాబినెట్ భేటీలో విశాఖ పెట్టుబడుల సదస్సు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వంటి పలు ఆసక్తికర అంశాలపై చర్చించనుంది క్యాబినెట్.
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దీనిపై క్యాబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్ల పనులను మంత్రులు, అధికారులకు అప్పగించారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారం వంటి విషయాలపైనా చర్చించనున్నారు. సీఆర్డీఏ NaBFID నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు సైతం క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది.
మరోవైపు రాష్ట్రాభివృద్ధి కోసం పలు సంస్థలకు కేటాయించిన భూములకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజన (District Reorganization) చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా కీలక నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. దీనిపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు
Read Latest AP News And Telugu News