Guntur Commissioner : ‘‘ఏం తమాషాగా ఉందా..’’
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:44 AM
గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ సమావేశం (కౌన్సిల్ మీటింగ్)లో కమిషనర్ పులి శ్రీనివాసులకు అవమానం జరిగింది.

గుంటూరు కమిషనర్‌ను ఉద్దేశించి వైసీపీ డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలు
కౌన్సిల్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి ఉద్యోగుల నిరసన
గుంటూరు కార్పొరేషన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ సమావేశం (కౌన్సిల్ మీటింగ్)లో కమిషనర్ పులి శ్రీనివాసులకు అవమానం జరిగింది. మేయర్ మనోహర్‌నాయుడు అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా కమిషనర్, ఉద్యోగులపై వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏం తమాషా చేస్తున్నారా.. ఏమనుకుంటున్నారు.. బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ కమిషనర్, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండాలోని అంశాలపై చర్చిస్తున్న క్రమంలో ఫిక్సిడ్ డిపాజిట్ల డ్రా విషయంపై కమిషనర్ సమాధానం చెప్తుండగా డైమండ్‌బాబు జోక్యం చేసుకున్నారు. ‘‘ఎవరు.. ఈ సమాధానం రాసింది’’ అని ఏక వచనంతో సంబోధించగా కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ‘‘సభకు అందజేసిన ప్రతి కాపీ విభాగాధిపతుల నుంచి తెప్పించుకుని సిద్ధం చేశాను.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి’’ అని కమిషనర్ తెలిపారు.
ఈ సమాధానం ముందే చెప్పి ఉండాలని డైమండ్‌బాబు అనడంతో.. ‘‘అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం, మీరు నోటి దురుసుగా మాట్లాడొద్దు, ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని కమిషనర్’’ అన్నారు. దీనిపై స్పందించిన డైమండ్‌బాబు ‘‘ఏం తమాషాగా ఉందా.. అధికారులు తమాషాలు చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. దీంతో తాము సమావేశంలో ఉండలేమని, ఈ విధంగా మాట్లాడితే సమాధానం చెప్పలేమంటూ కమిషనర్.. మేయర్‌కు విన్నవించి బయటకు వచ్చేశారు. కమిషనర్‌ను అవమానించడంతో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి కమిషనర్ చాంబర్ నుంచికౌన్సిల్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. టీడీపీ కార్పొరేటర్ బాలాజీ మాట్లాడుతూ వైసీపీ నాయకులు కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. టీడీపీ, జనసేన కార్పొరేటర్లు బాయ్ కాట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తూ తీర్మానం చేశారు.