Puttaparthi: వెండిరథంపై బంగారు సాయి..
ABN , Publish Date - Nov 19 , 2025 | 07:34 AM
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
- వైభవంగా సత్యసాయి నారాయణ రథోత్సవం
- వేలాదిగా హాజరైన భక్తులు..
- పులకించిన పుట్టపర్తి
పుట్టపర్తి: సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తులనడుమ సత్యసాయి నారాయణ రథోత్సవం జరిగింది. సాయికుల్వంతు మందిరంలో సత్యసాయి స్వర్ణ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ విగ్రహాన్ని, వేణుగోపాలస్వామి, సీతారాముల ఉత్సవ మూర్తులను గోపురం వద్దకు తోడ్కొని వచ్చి వెండి రథంపై కొలువుదీర్చారు.
సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు విద్యార్థులు వేదమంత్రాలు పటిస్తూ నడవగా, వారి వెనుక మంగళవాయుద్యాలు, భజనలు, కోలాటం, గురవయ్యల నృత్యం, దేవతా వేషధారణలో చిన్నారులు కదిలారు. ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సత్యసాయి రథోత్సవంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ భక్తులు తమ తమ ప్రాంతాల సంప్రదాయ నృత్యాలతో అలరించారు. రథోత్సవంపై డ్రోన్ కెమరాతో పూల వర్షం కురిపించారు.
పెద వెంకమరాజు కల్యాణ మండపానికి చేరుకున్న అనంతరం రథానికి రత్నాకర్, వేద పండితులు మంగళహారతి ఇచ్చి రథోత్సవాన్ని ముగించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నవిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరా రెడ్డి, మాజీ ఎంపీ మురళీ మోహన్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళల ద్వారా సమాజానికి సంస్కృతిని, సేవలను, ఆధ్యాత్మికతను పంచేందుకే సత్యసాయి 30 ఏళ్ల క్రితం, 1995లో శ్రీసత్యసాయి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా నవంబరు 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో 30వ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని హిల్‌వ్యూ స్డేడియంలోనే నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ క్యాక్రమానికి హాజరుకానున్నారు.
హిల్‌వ్యూ స్టేడియం ముస్తాబు
హిల్ వ్యూ స్టేడియంలో బుధవారం జరిగే సత్యసాయ శత జయంతి వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వీవీఐపీలు కూర్చునేందుకు ఒక వేదిక, సాంస్కృతిక ప్రదర్శనలకు మరో వేదికను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం స్టేడియంలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భక్తులు, అతిథులకు నారాయణ సేవ, తాగునీరు, వైద్యం, రవాణా.. ఇలా అన్ని సౌకర్యాలను కల్పించారు.
అలరించిన సురాంజలి
సత్యసాయి భక్తులు సురాంజలి పేరిట నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. సాయికుల్వంతు సభా మంటపంలో మంగళవారం రాత్రి అభి, కుమారి అంతరానంది బృందం సంగీత గాన కచేరి నిర్వహించింది. అనంతరం ట్రస్టు ప్రతినిధులు వారిని ఘనంగా సత్కరించారు. సత్యసాయి ప్రేమతత్వంపై విద్యార్థులు భక్తిగీతాలను ఆలపించారు. వేలాది మంది భక్తులు సత్మసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు నారాయణ సేవను అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News