Share News

APSRTC : స్టీరింగ్‌, సిగ్నల్‌ ఒక్కరికే

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:47 AM

ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ) కమిషనర్‌ పదవిని అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

 APSRTC : స్టీరింగ్‌, సిగ్నల్‌ ఒక్కరికే

  • ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకే పీటీడీ కమిషనర్‌ పోస్టు

  • ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం

  • పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకు నిర్ణయం

  • ముడుపుల వివాదానికి ముగింపు పలికేలా చర్యలు

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీ పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ) కమిషనర్‌ పదవిని అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ స్టీరింగ్‌తో పాటు సిగ్నల్‌ కూడా ఒకే చేతికి వచ్చినట్లయింది. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తూ నెలకు రూ.500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఏపీఎ్‌సఆర్టీసీకి ఎండీ అండ్‌ కమిషనర్‌ పోస్టులు కీలకం. మూడున్నరేళ్లు ఆ పోస్టులో కొనసాగిన డీజీపీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమల రావు జనవరి 31న రిటైరయ్యారు. ఆయన్ను ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు ఆర్టీసీ ఎండీగా నియమించారు. పీటీడీ కమిషనర్‌ పదవి ఇవ్వలేదు. కార్పొరేషన్‌ పరిధిలో బస్సులు, ఆస్తులు ఉండగా.. పీటీడీ పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. దీంతో ఆర్టీసీకి ఎండీతో పాటు పీటీడీ కమిషనర్‌ పోస్టులో ఒక్కరే ఉంటే.. ఆపరేషన్స్‌కు, అడ్మినిస్ట్రేషన్‌ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే రిటైరయిన అధికారి చేతికి అడ్మినిస్ట్రేషన్‌ అప్పగించడం సరికాదనే వాదనలు నేపథ్యంలో ఎండీ బాధ్యతల వరకే ద్వారకా తిరుమలరావుకు ప్రభుత్వం అప్పగించింది. అడ్మిన్‌ వ్యవహారాలు చూసుకోవడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండేకి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇదే సమయంలో సూపర్‌ వైజర్ల నుంచి ఈడీ వరకూ సుమారు 118 మందికి పదోన్నతుల ప్రక్రియ మొదలైంది.


డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్స్‌ కమిటీ(డీపీసీ) జరపాలంటే ప్రతి ఒక్కరూ స్థాయిని బట్టి కనీసం రూ. 30 వేల నుంచి రూ. లక్ష వరకూ ముడుపులు ఇవ్వాలనే ఒత్తిడి పెరిగింది. కొందరు డబ్బు ఇవ్వడానికి సిద్ధం అవగా మరికొందరు ఇవ్వలేమని, ఇంకొందరు పోస్టింగ్స్‌ ఇచ్చేటప్పుడు ఇస్తామని చెప్పారు. దీంతో పదోన్నతుల ఫైలు ముందుకు కదల్లేదు. విషయం బయటికి పొక్కి పత్రికల్లో వార్తలు రావడంతో ప్రభుత్వం ఆరా తీసింది. ఇదే సమయంలో.. ‘స్టీరింగ్‌ ఒకరికి.. సిగ్నల్‌ మరొకరికి..’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు, పదోన్నతుల్లో ముడుపుల వ్యవహారాలకు చెక్‌ పెట్టాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు పదవులు ద్వారకా తిరుమలరావుకు అప్పగించింది.

Updated Date - Feb 28 , 2025 | 03:47 AM