Share News

Medical Examination: జీజీహెచ్‌ వైద్యురాలి అతి

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:59 AM

గోరంట్ల మాధవ్‌ను గుంటూరు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యురాలితో వివాదం జరిగింది. ఆమె అతిగా వ్యవహరించడంపై పోలీసులు జోక్యం చేసుకుని, వైద్యపరీక్షలు పూర్తిచేశారు

Medical Examination: జీజీహెచ్‌ వైద్యురాలి అతి

  • పోలీసులు కొట్టలేదని గోరంట్లే చెప్పినా..అరికాలు, మోకాలు చూపించాలని హడావుడి

గుంటూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలో హైడ్రామా చోటు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడ పనిచేసే ఓ వైద్యురాలు అతిగా వ్యవహరించినట్లు సమాచారం. టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తమ సమక్షంలోనే దాడికి యత్నించిన మాధవ్‌ను పోలీసులు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ మాజీ మహిళా మంత్రి బంధువైన వైద్యురాలు అత్యుత్సాహం ప్రదర్శించారని.. తనను పోలీసులు కొట్టలేదని ఆయనే స్వయంగా చెప్పినా.. పోలీసులు కొట్టారా అని న్యాయాధికారి మాదిరిగా అడిగారు. అరికాలు చూపించు.. మోకాళ్లు చూపించాలని గుచ్చిగుచ్చి అడగడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. పోలీసులను ఇరికించేందుకు యత్నిస్తున్నారని గ్రహించిన నిఘా వర్గాలు విషయాన్ని ఎస్పీ సతీశ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఆయన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో మాట్లాడి విషయం చెప్పినట్లు తెలిసింది.సూపరింటెండెంట్‌ జోక్యం చేసుకోవడంతో ఆమె మాధవ్‌, ఆయన అనుచరులకు వైద్య పరీక్షలు పూర్తిచేసి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన సందర్భంలో ఆయన్ను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తరలించడం.. అరికాళ్లు, శరీరంపై కమిలిన గాయాలు ఉన్నప్పటికీ దెబ్బలు లేవని నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి నివేదిక ఇవ్వడం తెలిసిందే.


12 మంది పోలీసు సిబ్బందిపై వేటు

గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా 12 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటువేశారు. మాధవ్‌ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి మరీ పోలీసులు, వారి అదుపులో ఉన్న నిందితుడిపైనా దాడికి దిగడం ద్వారా పోలీసు శాఖకు సవాల్‌ విసిరారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనపై కఠినంగా వ్యవహరించాల్సిందిపోయి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. వైసీపీ వారితో ఒకరిద్దరు లోపాయకారీ సంబంధాలు నెరుపుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బి సీతారామయ్యను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ ఆదేశించారు. అలాగే మాధవ్‌కు వైద్య పరీక్షల నిర్వహణ, బందోబస్తుకు నియమితులైన 11 మంది అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. వీరిలో అరండల్‌పేట సీఐ వీరాస్వామి, నగరంపాలెం ఎస్సై రామాంజనేయులు, పట్టాభిపురం ఎస్సై రాంబాబు, ఏఎస్సైలు ఏడుకొండలు (అరండల్‌పేట), ఆంధోని (అరండల్‌పేట), హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేష్‌ (నగరంపాలెం), కానిస్టేబుళ్లు తులసి నారాయణ, మోషే (పట్టాభిపురం), నగరంపాలెంకు చెందిన ప్రేమ్‌కుమార్‌, వెంకట స్వామి, మహేష్‌రావు తదితరులు ఉన్నారు. కాగా.. గుంటూరు ఎస్పీని శనివారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రెండ్రోజుల పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Apr 13 , 2025 | 05:01 AM