Swimmer Goli Shyamala : సంద్రంలో సాహస యాత్ర
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:18 AM
నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహ సం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు.

150 కి.మీ. అలవోకగా ఈదిన 52 ఏళ్ల స్విమ్మర్ శ్యామల
విశాఖ నుంచి ఈదుకుంటూ కాకినాడ తీరానికి రాక
ఏడు రోజులు అలుపెరుగక ఈత
ఆసియాలోనే మొదటి స్విమ్మర్‌గా ఘనత
సర్పవరం జంక్షన్(కాకినాడ), జనవరి 3(ఆంధ్రజ్యోతి): నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహ సం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు. మహిళల ఆరో గ్యం, పర్యాటకరంగ అభివృద్ధి లక్ష్యంతో కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి ఈత ప్రారంభించారు. జనవరి 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నానికి కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకున్నారు. ఆసియాలోనే ఈ లక్ష్యాన్ని సాధించిన మొదటి స్విమ్మర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. సముద్రంలో ప్రతిరోజూ సూర్యోదయం సమ యంలో ఆమె ఈత ప్రారంభించేవారు. సూర్యాస్తమయానికి ఆపేసి రాత్రి విశ్రాంతి తీసుకునేవారు. దీని కోసం ఆమెకు సహకారంగా ఒక నేవీ బోటు వెంట వచ్చింది. స్విమ్మర్ శ్యామల మాట్లాడుతూ.. ఈ రికార్డుతో ప్రపంచంలోనే నాలుగో అంతర్జాతీయ స్విమ్మర్‌గా, దేశంలో నంబర్‌వన్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. భోజన విరామం కోసం మధ్యాహ్నం అరగంట బోట్‌లోకి వెళ్లి పెరుగు అన్నం, లిక్విడ్‌ని ఆహారంగా తీసుకున్నానని చెప్పారు. రాంబిల్లి సముద్రంలో తాబేళ్లు చక్కగా తనను వెంబడించడం ఆనందంగా ఉందని, జెల్లీ ఫిష్‌లు ఇబ్బంది పెట్టాయని తెలిపారు. తన బృందంలో ఒక డాక్టర్, ముగ్గురు సూపర్ డైవర్స్, ఫీడర్, అబ్జర్వర్ ఉన్నారని తెలిపారు. రోడ్డు మార్గంలో అంబులెన్స్ వచ్చిందన్నారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాల ని, ఇతర దేశాల స్విమ్మర్లు ఇక్కడకు వచ్చి స్విమ్మింగ్ చేయాలని ఆకాంక్షించారు. వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
కాకినాడ తీరంలో ఘన స్వాగతం
సాహస యాత్ర పూర్తి చేసుకున్న స్విమ్మర్ శ్యామలకు కోరమాండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ కమిషనర్ భావన, కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి ప్రతినిధులు కాకినాడ తీరంలో ఘనస్వాగతం పలికారు. అభినందన సభలో ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ.. ఎంత టి క్లిష్టమైన సమస్య ఉన్నా కుంగిపోకుండా మహిళలంతా ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. శ్యామల సముద్రంలో అసమాన్య సాహస యాత్ర చేశారని చెప్పారు. గతంలో శ్రీలంక నుంచి రామసేతు వరకు, లక్షద్వీప్ వద్ద సముద్రంలో ఈది రికార్డు సృష్టించారని చెప్పారు.