MLA Ganta Srinivasa Rao: కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించాలిగా
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:17 AM
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్లబ్‌కు భూమి కేటాయించిన విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తమకు తెలియకుండా కలెక్టర్‌కు లేఖ ఇవ్వడంపై ప్రశ్నించారు. విష్ణుకుమార్‌రాజు పొరపాటుగా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని క్షమాపణలు తెలిపారు.

విష్ణుకుమార్‌రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్
తనకు తెలియకుండా కలెక్టర్‌కు లేఖ ఇవ్వడంపై ఆగ్రహం
ఫిల్మ్ క్లబ్‌కు భూ కేటాయింపు అంశంపై వివాదం
పొరపాటైందంటూ క్షమాపణ చెప్పిన విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడిరోడ్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు తెలియకుండా వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిల్మ్ క్లబ్)కు భూమి కేటాయింపుపై ఆరుగురు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి జిల్లా కలెక్టర్‌కు ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో పొరపాటైందంటూ విష్ణుకుమార్‌రాజు క్షమాపణ చెప్పారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం(జీవీఎంసీ) వద్ద శనివారం జరిగిందీ ఘటన. జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు నేపథ్యంలో శనివారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో వీరిద్దరూ హాజరయ్యారు. సమావేశం ముగిశాక తన కారు ఎక్కుతున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పలకరించారు. దీంతో గంటా ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లోకల్ ఎమ్మెల్యేను. నాకు తెలియకుండా ఫిల్మ్ క్లబ్ కోసం లెటర్ ఎలా ఇస్తారు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఫోస్ట్‌లు పెట్టి గోలగోల చేస్తున్నారు’ అని గంటా పేర్కొన్నారు. దీంతో ‘సార్..సార్ అదేం లేదు. సీఎం దృష్టికి తీసుకువెళదామనే ఉద్దేశంతో..’ అని విష్ణుకుమార్‌రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ‘సీఎంకు కాకపోతే పీఎంకి ఇచ్చుకో. కానీ, లోకల్ ఎమ్మెల్యేనని కనీసం గుర్తించకుండా లెటర్ ఎలా ఇచ్చావు.
సీనియర్ ఎమ్మెల్యేవి. దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నోడివి. కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించాలి కదా!’ అని గంటా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉండాలి. మీరు వేరే పార్టీలో ఉంటే ఏది మాట్లాడినా పర్వాలేదు. కలిసి వెళుతున్నాం కాదా! మీరు లెటర్ ఇవ్వగానే ఇదీ విష్ణుకుమార్‌రాజు పవర్ అంటూ.. అని ఎవడో వాట్సా్‌పలో పోస్ట్ చేశాడు. దీనికి ఏం సమాధానం చెప్పాలి’ అని గంటా నిలదీశారు. ఎవరు పోస్టు చేశారని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించగా.. ‘ఎవరో ఒక బేవర్స్‌గాడు ఉన్నాడు కదా!’ అని గంటా విసురుగా తల తిప్పుకుని, కారు పోనివ్వాలంటూ డ్రైవర్‌ను ఆదేశించారు. కాగా, ‘ఇది ఇంటర్నల్ ఇష్యూ’ అంటూ విష్ణుకుమార్‌రాజు మీడియా ఎదుట దాటవేసే ప్రయత్నం చేశారు. వైజాగ్ ఫిల్మ్ క్లబ్‌కు గతంలో ప్రభుత్వం కాపులుప్పాడ వద్ద ఐదెకరాలు కేటాయించిందని, అందులో 33 ఏళ్ల లీజు అనే ప్రస్తావన లేకపోవడంతో సరిదిద్దాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. పొరపాటున స్థానిక ఎమ్మెల్యే గంటాకు ఈ విషయం చెప్పలేదని, అందుకు క్షమాపణ కోరుతున్నానని తెలిపారు.