Tirupati: దూసుకొచ్చిన మృత్యువు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:33 AM
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్ లారీని డీకొన్న కారు లారీ కింద పడిపోయి ఘోరంగా నుజ్జునుజ్జయింది

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురి మృతి
ముందు వెళుతున్న కంటైనర్ లారీని డీకొన్న కారు
మృతుల్లో ఒకరిది హోసూరు.. నలుగురిది బెంగళూరు
పాకాల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు నెమ్మదిగా వెళుతున్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టి లారీ కిందకు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరుకు చెందిన గీతమ్మ (51), విజయలక్ష్మి (50), సహన (34), ఎస్‌ఆర్ రజని (27) తమిళనాడులోని హోసూరులో జీఆర్‌బీ డెయిరీ ప్రొడక్ట్స్‌లో ఉద్యోగులు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలు దర్శించుకుని రావాలని ఈ నలుగురూ హోసూరులో కారు అద్దెకు తీసుకుని గత శనివారం తిరుమల వచ్చారు. వారి వెంట గీతమ్మ కుమారుడు లేఖన్ గౌడ (11), డ్రైవర్ త్యాగరాజన్ కుమారుడు క్రిస్విన్(15) కూడా ఉన్నారు.
శనివారం తిరుమల చేరుకుని ఆదివారం కూడా అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం శ్రీకాళహస్తి వెళ్లి ముక్కంటిని దర్శించుకుని స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పాకాల మండలం తోటపల్లి వద్ద కారు వేగంగా వెళుతూ ముందు జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నుంచి బెంగళూరు వెళుతున్న కంటైనర్ లారీని వెనుక వైపు నుంచి ఢీకొంది. ఆ ధాటికి కారు కంటైనర్ కిందికి దూసుకుపోయి నుజ్జునుజ్జు అయింది. క్రేన్ సాయంతో పోలీసులు, స్థానికులు కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారును అతికష్టమ్మీద వెలుపలికి తీశారు. డ్రైవర్ త్యాగరాజు, విజయలక్ష్మి, సహన, ఎస్‌ఆర్ రజని, గీతమ్మ కుమారుడు లేఖన్ గౌడ అక్కడికక్కడే మృతిచెందారు. గీతమ్మ, డ్రైవర్ త్యాగరాజు కుమారుడు క్రిస్విన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అతి వేగానికి తోడు డ్రైవర్ నిద్రమత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందడం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News