East Godavari: తూర్పు మహిళకు పీఎం కేర్ తొలి చెక్
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:35 AM
మిషన్ వాత్సల్య-పీఎం బాల సంరక్షణ యోజన (పీఎం కేర్) కింద భారత్‌లో ఇచ్చిన మొదటి చెక్‌ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు.

ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు అందజేత
దేశంలోనే మొదటి చెక్ అందుకున్న సునియా
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మిషన్ వాత్సల్య-పీఎం బాల సంరక్షణ యోజన (పీఎం కేర్) కింద భారత్‌లో ఇచ్చిన మొదటి చెక్‌ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పీఎం కేర్‌లో భాగంగా తొలివిడతలో దేశవ్యాప్తంగా 19 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వారిలో తొలి చెక్కును తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామానికి చెందిన ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి ప్రశాంతి చేతులమీదుగా ఈ చెక్కును అందజేశారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన సుమామణి.. 2020 మే 19న కొవిడ్ కారణంగా తల్లి ప్రత్తిపాటి భారతిని కోల్పోయింది.
అంతకు కొన్నేళ్ల ముందే తండ్రి విజయకుమార్ కూడా మృతిచెందారు. దీంతో సుమామణి, ఆమె చెల్లి సుగంధ రత్నం అనాథలయ్యారు. బాబాయి, మామయ్యలు, బంధువులు వారిని చూసుకున్నప్పటికీ.. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించే పరిస్థితి లేదు. సుమామణి 2022లో బొబ్బిల్లంక గ్రామానికి చెందిన కోట సాయిరాంను వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది.
అమ్మ మిషన్ కుట్టి చదివించింది..
7వ తరగతి చదువుతున్నప్పుడు నాన్న చనిపోయారు. అమ్మ మిషన్ కుడుతూ మమ్మల్ని పోషించేది. ఆ డబ్బులతోనే నన్ను, చెల్లిని చదివించింది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సమయంలో అమ్మ కొవిడ్ సెకండ్ వేవ్‌లో చనిపోయింది. చదువు మానేశాను. ఈ సమయంలో పీఎం కేర్ ద్వారా కొంత ఆర్థిక సహాయం అందడంతో మళ్లీ నర్సింగ్ కొనసాగించాను. తల్లిదండ్రులు లేని లోటును ప్రభుత్వం తీర్చింది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
- సునియా సుమామణి