Fake Liquor Scam: ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్..
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:26 AM
రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి. నాసిరకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది.

రాష్ట్రంలో నకిలీ మద్యం హల్‌చల్
ఎక్సైజ్ దాడులతో వెలుగులోకి
కోనసీమ, పశ్చిమలో కల్తీ దందా
అనకాపల్లి, కడపల్లోనూ కేసులు
డిస్టిలరీల నుంచి స్పిరిట్ బయటికి దానికి రంగు, నీళ్లు కలిపి అమ్మకాలు
మూతలు, లేబుళ్లు సొంతగా తయారీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి. నాసిరకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది. తాజాగా కోనసీమ జిల్లాలో కల్తీ మద్యం యూనిట్‌పై జరిపిన దాడిలో 1,065 లీటర్ల స్పిరిట్, 125 క్వార్టర్ సీసాలు, నకిలీ మూతలు, లేబుళ్లు పట్టుబడ్డాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చేసిన దాడిలోనూ స్పిరిట్, గ్లిజరిన్, కరమెల్, సీలింగ్ యం త్రం, ఖాళీ సీసాలు దొరికాయి. అంతకుముందు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో, కడపలో సైతం భారీగా నకిలీ మద్యం దొరికింది. అక్కడ రూ.110 విలువైన క్వార్టర్ సీసాను బెల్టు షాపులో రూ.80కే అమ్ముతుండటంతో అక్రమాలు వెలుగులోకి వచ్చా యి. అనంతపురం జిల్లాలోనూ నకిలీ మద్యం అమ్మకాలు సాగుతున్నా అక్కడి అక్రమాలను బయటికి రాకుండా తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఎలా చేస్తున్నారు?
మద్యం తయారీకి ముడిసరుకు అయిన ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్ డిస్టిలరీల మధ్య రవాణా అవుతూ ఉంటుంది. దీనినే స్పిరిట్ అని కూడా పిలుస్తారు. రవాణా సమయంలో లారీల నుంచి వందల లీటర్ల స్పిరిట్ పక్కదారి పడుతోంది. కొన్నిచోట్ల డిస్టిలరీల నుంచే బయటకు వస్తోందన్న అనుమానాలున్నాయి. ఈ విధంగా తీసుకొచ్చిన స్పిరిట్‌లో నీరు, రంగు కలిపి సీసాల్లో పోసి మద్యం తయారుచేస్తున్నారు. స్పిరిట్‌లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. నిబంధనల ప్రకారం మన దేశంలో విక్రయించే మద్యంలో 42శాతం మాత్రమే ఆల్కహాల్ ఉండాలి. ఈ శాతం దాటితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తగ్గితే వినియోగదారులకు పూర్తిగా మత్తు ఎక్కదు. అందుకే ఆల్కహాల్ కచ్చితంగా 42శాతం ఉండేలా డిస్టిలరీల్లో మద్యం తయారుచేస్తారు. కానీ దొంగతనంగా మద్యాన్ని తయారుచేసేవారు తమకు తోచినంత స్పిరిట్ వాడుతుంటారు. అలాగే స్పిరిట్ ఏ స్థాయిది అయినా ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్నవారు మోసపోతున్నారు.
నకిలీ మూతలు, లేబుళ్లతో మాయ..
నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ తర్వాత అవసరమయ్యేవి మూతలు, లేబుళ్లు. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడా మూతలు, లేబుళ్లను అక్రమార్కులు తయారు చేసుకుంటున్నారు. ఆ సీసాలో సొంతగా తయారుచేసిన నాసిరకం మద్యం పోసి ఒరిజినల్ తరహా మూతలు బిగిస్తున్నారు. వాటిపై నకిలీ లేబుళ్లు అతికిస్తున్నారు. వాటిని ఎక్సైజ్ అధికారులు స్కాన్ చేసినా వివరాలేవీ రావు. విజయవాడ, కడప తదితర ప్రాంతాల్లో నకిలీ మూతలు తయారుచేస్తున్నట్లు ఎక్సైజ్ దాడుల్లో గుర్తించారు. నకిలీ మద్యంతో వినియోగదారులు మోసపోవడం సంగతి అటుంచితే ఇది అత్యంత ప్రమాదకరమని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. డిస్టిలరీలో తయారుచేసిన స్పిరిట్‌తోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నప్పటికీ దానిని బ్లెండింగ్ సరిగా చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ శాతం స్పిరిట్‌ను కలిపి తయారుచేసిన మద్యాన్ని తాగినవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. స్పిరిట్ అనుకొని మరేదైనా కలిపితే అది మరింత ప్రమాదం అవుతుంది. స్పిరిట్‌కు రంగు, వాసన ఉండవు. ఈ కారణంతోనే గతంలో ఇథైల్ ఆల్కహాల్ అని పొరపాటుపడి మిథైల్ ఆల్కహాల్‌తో మద్యం తయారుచేయడం పెద్ద ప్రమాదాలకు దారితీసింది. ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్రంలో కూడా అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే వాదన వినిపిస్తోంది.