Gotti Pati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచలేదు
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:18 AM
విద్యుత్ చార్జీలను ఇప్పటి వరకు పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంపు ఉండబోదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

భవిష్యత్తులోనూ పెంచబోం: మంత్రి గొట్టిపాటి
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలను ఇప్పటి వరకు పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంపు ఉండబోదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని, చివరి రెండేళ్ల పాలనలో ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపిందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.8,113 కోట్లకుపైగా విద్యుత్ చార్జీలను పెంచి ఈఆర్సీకి పంపిందని, 2023-24 సంవత్సరానికి కూడా మరో 11 వేల కోట్ల పెంపుపై ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనలతో పెరిగిన రూ.15 వేల కోట్ల విద్యుత్ భారాన్ని కూటమి ప్రభుత్వంపై మోపేలా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు పెంచిన వాళ్లే రోడ్డెక్కి ధర్నాలు చేయడం, ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 65 శాతం విద్యుత్ కొనుగోళ్లను తగ్గించామని, రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా ఇప్పటికే లక్ష కనెక్షన్లు తీసుకున్నామని, మరో రెండు లక్షల కనెక్షన్లకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.