Share News

Liquor Scam: ఇక ఈడీ వేడి!

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:10 AM

మద్యం కుంభకోణం కేసు మరో కీలక మలుపు తిరిగింది వేలకోట్ల ముడుపులు, విదేశీ లింకులు

Liquor Scam: ఇక ఈడీ వేడి!
YS Jagan

  • రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

  • మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం

  • ‘శర్వాణీ’ డిస్టిలరీ డైరెక్టర్‌ చంద్రారెడ్డికి నోటీసులు..

  • 28న విచారణకు హాజరుకావాలని ఆదేశం

  • జగన్‌ హయాంలో ‘ఆంధ్రా గోల్డ్‌’ పేరుతో శర్వాణీ హవా..

  • పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు

  • ఇదివరకే ‘సిట్‌’ నుంచి సమాచార సేకరణ..

  • ముడుపుల్లో విదేశీ లింకులు లాగడంపై దృష్టి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసు మరో కీలక మలుపు తిరిగింది! వేలకోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలతో దేశంలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్న ఈ స్కామ్‌లో తీగలాగేందుకు ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. శర్వాణీ ఆల్కోబ్రూ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో ఈనెల 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ హైదరాబాద్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌సింగ్‌ సమన్లు జారీ చేశారు. తాము గుర్తించిన/దర్యాప్తు జరుపుతున్న ‘మనీ లాండరింగ్‌’కు సంబంధించి వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

జగన్‌ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల లిక్కర్‌ స్కామ్‌పై విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ‘సిట్‌’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఏ1 రాజ్‌కసిరెడ్డితో మొదలుకుని... వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీటు కూడా దాఖలు చేశారు. మద్యం ముడుపుల వసూలు నుంచి అవి అంతిమంగా చేరిన చోటు వరకు... అనేక కోణాల్లో ‘సిట్‌’ దర్యాప్తు చేసింది. సాంకేతిక ఆధారాలూ సేకరించింది. ఈ కుంభకోణం తీవ్రత నేపథ్యంలో ఈడీ ఇప్పటికే ‘సిట్‌’ నుంచి ఈ కేసు వివరాలను తీసుకుంది. దీనిపై తాను సొంతంగా దర్యాప్తు ప్రారంభించింది. మరీ ముఖ్యంగా... తన పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్‌పై దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో శర్వాణీ ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్‌ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది. ఇక కదలాల్సింది విదేశీ డొంకే.


‘ఆంధ్రా గోల్డ్‌’ వీరిదే..

జగన్‌ హయాంలో అతి భారీగా లిక్కర్‌ ఆర్డర్లు పొందిన కంపెనీల్లో ‘శర్వాణీ’ ఒకటి. ఈ వివరాలను ‘సిట్‌’ తన చార్జిషీటులో ప్రస్తావించింది. అంతకుముందు ఈ కంపెనీ ‘ఆంధ్రాగోల్డ్‌ విస్కీ’ తయారు చేసేది. ధరలు పెంచి, ఆర్డర్లు ఇచ్చే కుట్రలో భాగంగా అదే పేరు ధ్వనించేలా దానిని ‘‘ఆంధ్రాగోల్డ్‌ ఫైన్‌ విస్కీ’గా మార్చారు. అంతకుముందు రూ.696 ఉన్న కేసు ధరను రూ.854కు పెంచారు. ఐదేళ్లలో ఈ బ్రాండ్‌కే రూ.39.86 కోట్లు అదనంగా చెల్లించారు. ఇక... శర్వాణీకే చెందిన ఓల్డ్‌ అడ్మిరల్‌ డీలక్స్‌ బ్రాండ్‌ బ్రాందీ పేరును ‘ఓల్డ్‌ అడ్మిరల్‌ ఫైన్‌ బ్రాందీ’గా మార్చి... కేసు ధరను రూ.688 నుంచి 804కు పెంచారు. అసలు విషయం ఏమిటంటే... వైసీపీ అధికారంలోకి వచ్చాకే శర్వాణీ ఆల్కోబ్రూ లిమిటెడ్‌కు ‘మంచి రోజులు’ మొదలయ్యాయి. వీళ్లు పెట్టిన ప్రతి ‘ఆర్డర్‌ రిక్వె్‌స్ట’నూ అనుమతించారు. 2019-20లో 4 లక్షల కేసులకు మాత్రమే ఆర్డర్‌ ఇవ్వగా... ఆ తర్వాత వరుసగా ఏటా 16లక్షల కేసులను ‘శర్వాణీ’ నుంచి కొనుగోలు చేయడం గమనార్హం.

అప్పుడే ఆరోపణలు..

మద్యం అక్రమాల్లో శర్వాణీ ఆల్కోబ్రూ పాత్ర కూడా ఉందంటూ 2022లోనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టీడీపీ నేతలు ‘శర్వాణీ’ అక్రమాలపై ప్రెస్‌మీట్‌ పెట్టి వివరించారు. దీంతో... వారిపైనా, ఆ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలపైనా కంపెనీ డైరెక్టర్‌ చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు... అదే కంపెనీకి ఈడీ నోటీసులు పంపింది. చంద్రారెడ్డికి ఎంపీ మిథున్‌ రెడ్డితోసహా పలువురు వైసీపీ నేతలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ‘సిట్‌’ పలుమార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. తనకు 60 ఏళ్లవయసు పైబడినందున విచారణకు హాజరు కాలేనంటూ తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు... అదే చంద్రా రెడ్డికి ఈడీ నుంచి పిలుపు వచ్చింది. మద్యంలో వచ్చిన ముడుపుల సొమ్మును అమెరికాతోపాటు దక్షిణాసియా, ఆఫ్రికా వంటి దేశాల్లో పెట్టుబడులుగా పెట్టే ప్రయత్నాలు బలంగా జరిగినట్లు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ప్రణయ్‌ ప్రకాశ్‌ వాంగ్మూలం ఇచ్చారు. ఆఫ్రికాలో మైనింగ్‌ ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నట్లుగా, పలు కీలక కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.


Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 09:46 AM