Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:05 PM
పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.

సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారు?.. చదువులన్నా.. పరీక్షలన్నా భయపడుతూ ఉంటారు. కొంతమందికి పరీక్షలు దగ్గరపడ్డాయంటే చాలు.. లేని పోని రోగాలు వస్తుంటాయి. పరీక్షల రోజు చిన్న గాయం తగిలినా చాలు డుమ్మా కొట్టడానికి చూస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే విద్యార్థి మాత్రం అందరికీ భిన్నమైన వాడు. పాము కరిచినా సరే అతడు పరీక్షలు మాత్రం మానుకోలేదు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి మరీ పరీక్షలు రాశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. వై.నిస్సి అనే అబ్బాయి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడటంతో ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ ఉన్నాడు.
శనివారం రోజు కూడా ఓ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఓ నాగు పాము కాటువేసింది. ఉపాధ్యాయులు వెంటనే అతడ్ని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిస్సికి యాంటీ డోట్ ఇచ్చారు. రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయితే, సోమవారం 10వ తరగతి పరీక్షలు ఉండటంతో అతడు ఆస్పత్రి నుంచి నేరుగా లక్ష్మీ నరసాపురంలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష రాశాడు. పరీక్ష అయిపోయిన వెంటనే మళ్లీ ఆస్పత్రికి తిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ పరీక్ష సమయం దగ్గర పడే వరకు అక్కడే ఉంటాడు. పరీక్ష రోజు ఆస్పత్రినుంచి పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్ష రాయనున్నాడు. చదువుపై నిస్సికి ఉన్న శ్రద్ధాభక్తులకు జనం నోరెళ్లబెడుతున్నారు. శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కొచ్చీలోనూ ఇలాంటి ఘటనే..
2017లో కేరళలోని కొచ్చీ ప్రాంతానికి చెందిన అబిన్ అనే 16 ఏళ్ల బాలుడ్ని పాము కాటు వేసింది. ఇంటి గోడ దూకినపుడు అక్కడే ఉన్న పాము కాటేసింది. పాము కాటు వేసినా అతడు భయపడలేదు. పాము కాటు వేసిన చోట రక్తాన్ని బయటకు లాగేశాడు. సబ్బుతో దాన్ని కడిగేశాడు. తనను పాము కాటు వేసిందని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. మరుసటి రోజు వాంతులు మొదలయ్యాయి. పాము కాటు వేసిన చోట బాగా ఉబ్బింది. అది గమనించిన తల్లిదండ్రులు బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్ రే తీసినా ఏం లాభం లేకపోయింది. ఇంటికి పంపేశారు. మరుసటి రోజు ఉదయానికి శరీరం మొత్తం వాచి పోయింది. మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బ్లడ్ టెస్ట్ తీయగా.. ప్లేట్ లేట్స్ బాగా పడిపోయినట్లు తేలింది. కంటి చూపు బాగా మందగించింది. మెదడుపై కూడా పాము కాటు ప్రభావం పడింది. దాన్నుంచి కోలుకోవడానికి అతడికి ఏకంగా సంవత్సరన్నర పట్టింది. పాము కాటు నుంచి కోలుకున్న తర్వాత పదవ తరగతి పరీక్షలు రాశాడు.
ఇవి కూడా చదవండి...
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News