బాబోయ్.. బాదుడు!
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:41 AM
సంక్రాంతి పండగకు అప్పుడే చార్జీలు షాక్ కొడుతున్నాయి. స్వగ్రామాలకు రావాలంటేనే టికెట్ ధరలు గూబగుయ్‌మనిపిస్తున్నాయి. బస్సులు.. విమానాలు.. రైలు చార్జీలు మూడిం తలు పెరిగిపోయాయి. టికెట్ కొందామన్నా ఏకంగా దొరకని పరిస్థితికి చేరిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 14న బుధవారం సంక్రాంతి పండుగ. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభు త్వాలు కూడా ముందుగానే జనవరి 10 నుంచి సెలవులు ప్రకటించాయి. దీంతో అప్పటి నుంచి వివిధ ప్రాం
సంక్రాంతి పండుగకు ఊరొచ్చే దారేది
అప్పుడే బస్సులు, రైళ్లు, విమాన చార్జీల దోపిడీ
జనవరి 10 నుంచి వీటన్నింటిలో టికెట్ ధరలు మూడింతలపైనే
హైదరాబాద్ టు రాజమహేంద్రవరం ఏకంగా రూ.16 వేలు దాటేసిన ఇండిగో చార్జి
బెంగళూరు నుంచి రూ.14వేలపైనే
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ వైపు వచ్చే రైళ్లన్నీ రిగ్రెట్
అటు ప్రైవేటు ట్రావెల్ బస్సుల ఏసీ స్లీపర్ చార్జీలు తడిసిమోపెడు
హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో జనవరి 9 నుంచే సీట్లు సున్నా
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పండగకు అప్పుడే చార్జీలు షాక్ కొడుతున్నాయి. స్వగ్రామాలకు రావాలంటేనే టికెట్ ధరలు గూబగుయ్‌మనిపిస్తున్నాయి. బస్సులు.. విమానాలు.. రైలు చార్జీలు మూడిం తలు పెరిగిపోయాయి. టికెట్ కొందామన్నా ఏకంగా దొరకని పరిస్థితికి చేరిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 14న బుధవారం సంక్రాంతి పండుగ. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభు త్వాలు కూడా ముందుగానే జనవరి 10 నుంచి సెలవులు ప్రకటించాయి. దీంతో అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి పనులపై ఎక్కడెడక్కడో ఉంటున్న వారంతా పండుగకోసం ఉమ్మడి జిల్లాలో వారి స్వగ్రామాలకు చేరుకుం టారు. ప్రధానంగా సంక్రాంతికి ఉమ్మడి జిల్లాకు చెందిన వారు హైదరాబాద్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు, సినిమా రంగంలో ఉన్నవారు, పండగ ఆనందా లకు బంధువుల రూపంలో కాకినాడ, రాజమ హేంద్రవరం, కోనసీమ ప్రాంతాలకు వస్తారు. అయితే ఇప్పటి నుంచే చార్జీలు ఆకాశాన్నంటే శాయి. సాధారణంగా సంక్రాంతి పండగకు వచ్చే వారికి ఎప్పుడో డిసెంబరు రెండో వారం నుంచి చార్జీలు పెరుగుతుంటాయి. కానీ ఈసారి పండుగకు ఏకంగా నవంబరుకే అన్నీ మూడిం తలు పెరిగిపోయాయి. హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లా వైపు వచ్చే రైళ్లన్నీ నిండిపోయి ఇప్పటికే రిగ్రెట్ చూపిస్తుండడం విశేషం.
బాబోయ్ ఎగరలేం..
పండగ అంటే సంక్రాంతి. ఈ పండుగకు ఎవరు ఎక్కడ ఉన్నా ముందుగానే రెక్కలు కట్టు కుని సొంతూర్లకు రావలసిందే. బంధుమిత్రుల తో సరదాగా గడపాల్సిందే. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి సందడే వేరు. భోగిమంటలు, కోడి పందేలు, గుండాట, జాతర్లతో ఏ ఊరు చూసినా సందడిగా మారుతుంది. ఉమ్మడి జిల్లా కు చెందినవారు ఎక్కువమంది సినిమా రంగం, ఐటీ, వ్యాపారరంగాలు, ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. వారంతా పిల్లాపాప లతో సొంతూర్లకు చేరుతారు. అయితే పండు గకు ఇంకా యాభై రోజులు ఉండగానే చార్జీలు మాత్రం అప్పుడే షాక్ కొట్టేస్తున్నాయి. ముఖ్యం గా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి సాధారణ రోజుల్లో ఇండిగో టికెట్ చార్జీ రూ. 4,271 వరకు ఉంటోంది. కానీ జనవరి 10 నుం చి మాత్రం చూస్తే గుండె గుబేల్‌మంటోంది. ఏకంగా ఈ రూట్లో అప్పుడే టికెట్ ఛార్జీ గరిష్ఠం గా రూ.16,241కి చేరిపోయింది. ఈ మార్గంలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రోజూ ఇండిగో నాన్‌స్టాప్, సింగిల్‌స్టాప్ కేట గిరీలో ఎనిమిది సర్వీసులు నడుపుతోంది. కానీ సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అప్పుడే ధర లను భారీగా పెంచేసింది. పండుగకు ఎక్కువ మంది కాస్త ధర ఎక్కువైనా వేగంగా వచ్చేం దుకు విమానాలనే ఎంచుకుంటున్నారు. దీంతో జనవరి నుంచి భోగి పండుగ రోజు వరకు చార్జీ లను దారుణంగా పిండేస్తోంది. తీరా సంక్రాంతి పండుగ రోజురూ.5,800 మాత్రమే వసూలు చేస్తోంది. అటు బెంగళూరులో పనిచేస్తోన్న ఉమ్మడి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పండుగకు ముందే వస్తారు. వీరిని కూడా జన వరి 10వ తేదీ నుంచి రూ.14 వేల వరకు పిండే స్తోంది. సాధారణ రోజుల్లో ఈ రూట్లో చార్జీ రూ.4,763కాగా, పండగ సాకుతో మూడింతల పైనే వసూలు చేస్తోంది.
రైళ్లన్నీ రిగ్రెట్...
హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకు ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, సామర్ల కోట, కడియం, అన్నవరం, తుని, కోనసీమ ప్రాం తాలకు వచ్చే వారంతా ఎక్కువగా రైళ్లపై ఆధార పడతారు. తీరా ఇవి కూడా వెయిటింగ్ లిస్ట్ కూడా నిండిపోయి ఏకంగా రిగ్రేట్ చూపిస్తు న్నాయి. సాధారణ రోజుల్లో ఈ రూట్లో రైళ్లకు రద్దీ ఎప్పుడూ ఉంటుంది. తీరా సంక్రాంతి పం డుగకు అయితే అంతకుమించి అన్నట్టు మారి పోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లా మీదుగా నిత్యం 17 రైళ్లు రాకపో కలు సాగిస్తుంటాయి. అయితే పండగ నేపథ్యం లో జనవరి 10 నుంచి ఇవన్నీ నిండిపోయాయి. ఎప్పుడూ ఎన్నోకొన్ని సీట్లు ఖాళీగా ఉండే వందే భారత్ రైళ్లలో కూడా జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు రిగ్రెట్ చూపిస్తోంది. అంటే వెయి టింగ్ లిస్ట్ టిక్కెట్లు కూడా అయిపోయి టికెట్ కూడా ఇవ్వని పరిస్థితికి చేరింది. అలాగే గరీబ్ రథ్ జనవరి 12వరకు రిగ్రెట్ చూపిస్తోంది. విశా ఖ ఏసీ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, గౌతమీ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ 13వ తేదీ వరకు రిగ్రెట్ కనిపిస్తోంది. చర్ల పల్లి, సాయినగర్ షిర్డీ, ఈస్ట్‌కోస్ట్, కోణార్క్, విశా ఖ ఎల్‌టీటీ సైతం అదే పరిస్థితి. చివరకు హైద రాబాద్ నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు కూడా 13 వరకు సీట్లన్నీ రిగ్రెట్‌లోకి వెళ్లాయి.
ట్రావెల్స్ ఉతుకుడు..
ప్రైవేటు ట్రావెల్స్ విషయానికొస్తే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, రావులపాలెం వైపు వచ్చేవన్నీ అప్పుడే చార్జీలు మూడింతలు పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ వైపు ఏసీ స్లీపర్ బస్సు చార్జీలు రూ.1079 నుంచి రూ.1419 వరకు ఉన్నాయి. కానీ సంక్రాంతి దోపిడీలో భాగంగా జనవరి 10 నుంచి ఏకంగా ఆయా ట్రావెల్స్ ఆధారంగా రూ.4150 నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా సీట్లు ఫుల్ అయినట్టు చూపుతున్నాయి. పండుగ దగ్గరయ్యే కొద్దీ ఈ రేట్లు మరింత పెంచడానికి సిద్ధమవుతున్నా యి. ఇక హైదరాబాద్ నుంచి రాజమహేంద్ర వరానికి ఆర్టీసీ రోజుకు 15 ఏసీ, నాన్‌ఏసీ సూపర్‌లగ్జరీ బస్సులు నడుపుతుం డగా, జనవరి 9 నుంచి 12 వరకు మూడు రోజుల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. మొత్తం అన్నీ బుక్ అయిపోవడంతో సోల్డ్‌అవుట్ కనిపిస్తోంది. కాకినాడకు హైదరాబాద్ నుంచి రోజూ ఆరు సర్వీసులు నడుస్తుండగా జనవరి 9 నుంచే ఫుల్ అయిపోయాయి