Minister Nadendla: వై నాట్ 175 అన్నారు.. ఇప్పుడు ఏమైంది: మంత్రి నాదెండ్ల..
ABN , Publish Date - Mar 14 , 2025 | 09:34 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు.

హైదరాబాద్: జనసేన (Janasena Party) ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడిందని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేశారంటూ మంత్రి కొనియాడారు. ప్రతిపక్షంలోనైనా, అధికారంలోనైనా జనసేన పార్టీ ఒకేలా ఉందంటూ నాదెండ్ల చెప్పుకొచ్చారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నామని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభలో మంత్రి నాదెండ్ల మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు.. దేశానికే ఉపయోగపడేలా పవన్ ఎదగాలని నాదెండ్ల ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు. రైతులు, మహిళలు రాజధాని కోసం పోరాడుతుంటే వారి కోసం ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్ర పెద్దలతో పవన్ చర్చించినట్లు చెప్పుకొచ్చారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన ఐదు రోజులకే పవన్.. ఢిల్లీకి వెళ్లారని, పార్లమెంట్ వద్దకు వెళ్లి అమిత్ షాను కలిశారని నాదెండ్ల తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని దాన్ని ప్రైవేటీకరణ చేయెుద్దంటూ అమిత్ షాతో పవన్ గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. 2019లో జనసేన ఉనికిపై ప్రశ్నల వస్తున్న సమయంలోనే భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం చేశామని అన్నారు.
పవన్ పిలుపుతో వారం రోజులపాటు నిర్మాణ రంగం కార్మికులకు జన సైనికులు ఆహారం అందించారని చెప్పుకొచ్చారు. కొవిడ్ సమయంలోనూ ఎంతోమంది అండగా నిలిచామని నాదెండ్ల గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం మండపేట, కాడినాడలో దీక్షలు చేసిన విషయాన్నీ ప్రస్తావించారు. జనసేన, పవన్ కల్యాణ్‌ది సామాన్యమైన ప్రస్థానం కాదని, ప్రతి అడుగులోనూ అనుమానాలు, అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. రాష్ట్రం, దేశం కోసం పని చేయాలంటూ కార్యకర్తలు, నాయకులను పవన్ కల్యాణ్ నడిపించారని.. ఒక సీటు కోసమే, పదవి కోసమే ఆయన ఎప్పుడూ పని చేయలేదని అన్నారు. కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వై నాట్ 175 అన్న మూర్ఖుడికి ప్రజలు, జనసేన కార్యకర్తలు సరైన సమయంలో బుద్ధి చెప్పారని మంత్రి నాదెండ్ల చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..
Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..