Cyber Fraud : కలెక్టర్‌కూ తప్పని ‘సైబర్’ షాక్!
ABN , Publish Date - Jan 22 , 2025 | 04:24 AM
సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో శ్రీలంక దేశానికి చెందిన కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్‌తో సిబ్బందికి మెసేజ్‌లు పంపించారు.

బాపట్ల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో శ్రీలంక దేశానికి చెందిన కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్‌తో సిబ్బందికి మెసేజ్‌లు పంపించారు. దీంతో కలెక్టరేట్ సహా ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన మంగళవారం బాపట్ల జిల్లాలో వెలుగు చూసింది. కలెక్టరేట్‌లోని ‘సీ’ సెక్షన్ విభాగంలో ఓ ఉద్యోగికి కలెక్టర్ వెంకటమురళి ప్రొఫైల్ ఫొటోతో ఉన్న నంబరు నుంచి ‘‘హలో.. వాట్ ఆర్ యూ డూయింగ్’ సహా మరో రెండు మెసేజ్‌లు వచ్చాయి. సదరు ఉద్యోగికి అనుమానం రావడంతో విషయాన్ని కలెక్టర్ సీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో మరో ముగ్గురికి కూడా ఇదే తరహా మెసేజ్‌లు అదే నంబరు నుంచి రావడంతో వెంటనే కలెక్టర్ పేషీ అప్రమత్తమైంది. వివిధ ఫోన్ నంబర్లతో జిల్లా కలెక్టర్ పేరిట మెసేజ్‌లు చేస్తూ సైబర్ దుండగులు ఫేక్ అకౌంట్ సృష్టించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా అధికారులతో పాటు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటమురళి సూచించారు.