Visakhapatnam: విహార నౌకలతో పర్యాటకాభివృద్ధి
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:13 AM
విహార నౌకలతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.

‘ఎంవీ ఎంప్రెస్’ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి సోనోవాల్
విశాఖ నుంచి రెగ్యులర్‌గా విహార నౌకలు: మంత్రి దుర్గేశ్
విశాఖపట్నం, జూలై 2(ఆంధ్రజ్యోతి): విహార నౌకలతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖపట్నం పోర్టులోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌కు వచ్చిన తొలి విహారనౌక ఎంవీ ఎంప్రెస్ (కార్డిలియా క్రూయిజ్ లైన్స్‌కు చెందినది)ను బుధవారం సాయంత్రం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జల రవాణా శాఖ సహాయ మంత్రి శంతన్ ఠాకూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నం నుంచి త్వరలో రెగ్యులర్‌గా విహార నౌకలు (క్రూయిజర్లు) నడిపేలా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. విహార నౌకల ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను విశాఖపట్నం తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ఒక సర్క్యూట్ కిందికి తీసుకువస్తామన్నారు. ‘హబ్ అండ్ స్పోక్స్’ విధానంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం చంద్రబాబునాయుడు ఆలోచన అని వివరించారు. విహార నౌకల ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుందని దుర్గేశ్ తెలిపారు.
పోర్టు చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు తీరం వెంబడి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సముద్ర సంబంధిత కార్యకలాపం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏటా క్రూయిజ్ ఆధారిత నైపుణ్యాలపై ఐదు వేల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలకు సిద్ధం చేస్తామన్నారు. ప్రత్యేక క్రూయిజ్‌లను నడిపే ప్రణాళిక ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై విశాఖ నుంచి విహార నౌకలో ప్రయాణించడానికి టికెట్లు కొనుగోలు చేసిన వారికి బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఎంవీ ఎంప్రెస్ నౌక చెన్నైలో బయలుదేరి బుధవారం ఉదయం విశాఖపట్నం అంతర్జాతీయ టెర్మినల్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి పాండిచ్చేరి, అక్కడి నుంచి తిరిగి చెన్నైకు చేరుతుంది.