Share News

CPI: స్మార్ట్‌మీటర్లు బిగిస్తే మరో బషీర్‌బాగ్‌ ఉద్యమం

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:36 AM

స్మార్ట్‌మీటర్లు బిగించడాన్ని తక్షణమే ఆపకపోతే మరో బషీర్‌బాగ్‌..

CPI: స్మార్ట్‌మీటర్లు బిగిస్తే మరో బషీర్‌బాగ్‌ ఉద్యమం

  • ప్రజలపై రూ.1500 కోట్ల భారాన్ని మోపిన జగన్‌

  • వైసీపీ విధానాలనే అవలంబిస్తున్న కూటమి సర్కారు

  • మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టండి

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

  • ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ప్రజావేదిక సదస్సు

విజయవాడ(గాంధీనగర్‌), జూలై 13 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌మీటర్లు బిగించడాన్ని తక్షణమే ఆపకపోతే మరో బషీర్‌బాగ్‌ ఉద్యమానికి ప్రజలు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ ‘స్మార్ట్‌మీటర్లు వద్దు- ట్రూ అప్‌ చార్జీలు రద్దు’ అంశంపై నగరంలోని దాసరిభవన్‌లో ఆదివారం ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ, స్మార్ట్‌మీటర్లు బిగింపు, ట్రూ అప్‌ చార్జీలు, ఇంధనపు సర్దుబాటు తదితర చార్జీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాకాదని విద్యుత సిబ్బంది స్మార్ట్‌మీటర్లు బిగించడానికి వస్తే వాటిని వినియోగదారులు వాటిని పగలగొట్టాలన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అదానీ నుంచి ముడుపులు తీసుకుని 25 సంవత్సరాల ఒప్పందంతో ప్రజలపై రూ.1500 కోట్ల భారాన్ని మోపారని ఆరోపించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు.. స్మార్ట్‌మీటర్లు బిగించడానికి వస్తే పగులగొట్టాలని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత బిగించాలంటూ ద్వంద్వ వైఖరి అవలంబించడాన్ని తప్పుబట్టారు. స్మార్ట్‌మీటర్లు బిగించడాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన టీడీపీ, జనసేన నాయకత్వం.. ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయకుండా అదానీ సంస్థను అనుమతించడం ప్రజలను మోసగించడమేనన్నారు. మరోవైపు విద్యుత్‌ వినియోగదారులపై భారాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. స్మార్ట్‌మీటర్లు బిగింపు, ట్రూ అప్‌ చార్జీలకు వ్యతిరేకంగా ప్రజావేదిక ఇచ్చిన పిలుపుకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.


సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యుత్‌ సంస్కరణలు, స్మార్ట్‌ మీటర్ల బిగింపుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు నుంచి పోరాటం ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్‌మీటర్ల బిగింపు, విద్యుత్‌ సంస్కరణలు రాజ్యాంగ విరుద్ధమైనవని, ఈ సంస్కరణలు పార్లమెంటులో ఆమోదం కాకుండా ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు. మరో బషీరాబాగ్‌ ఉద్యమం చేపట్టాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణను ప్రజావేదిక సదస్సు ప్రకటించింది. ఈ నెల 15, 16న జిల్లాలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 17 నుంచి 22 వరకు పట్టణ, మండల సదస్సులు, 23 నుంచి 29 వరకు ఇంటింటి ప్రచారం, సంతకాల సేకరణ, జూలై 30 నుంచి ఆగస్టు 4 వరకు వీధి/కాలనీ సమావేశాలు, ప్రదర్శనలు, 5న విద్యుత్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు ఉంటాయని పేర్కొంది. సీఐటీయూ నేత నరసింగరావు, ఇఫ్టూ, ఏఐటీయూసీ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 03:37 AM