Share News

Property Scam : విజిలెన్స్‌ గుప్పిట్లో ‘టీడీఆర్‌’ గుట్టు

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:51 AM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంజూరు చేసిన టీడీఆర్‌ బాండ్లపై జరుగుతున్న విజిలెన్స్‌ తనిఖీల్లో అవినీతి వ్యవహారం బట్టబయలైంది.

Property Scam : విజిలెన్స్‌ గుప్పిట్లో ‘టీడీఆర్‌’ గుట్టు

  • తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి హస్తం!

  • ముగ్గురు మహిళలకు చెందిన బాండ్లను రూ.12 కోట్లకు విక్రయించి... కుచ్చుటోపీ

  • బిల్డర్‌కు నాలుగో వంతు ముడుపులు

  • స్థలం యజమానులకు తెలియకుండానే బాండ్లు

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంజూరు చేసిన టీడీఆర్‌ బాండ్లపై జరుగుతున్న విజిలెన్స్‌ తనిఖీల్లో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. స్థల యజమానులకు తెలియకుండానే బాండ్లు జారీ అయినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీకి గిఫ్ట్‌ డీడ్‌గా స్థలాలు రాసినంత వరకే వాటి యజమానులు పరిమితమయ్యారు. బాండ్ల జారీ మాత్రం యజమానులకు తెలియకుండానే జరిగిపోయింది. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ శాఖ గుర్తించింది. తాడేపల్లిగూడెంలో 18 మందికి వైసీపీ హయాంలో బాండ్లు జారీ అయ్యాయి. వాటి విలువ సుమారు రూ.200 కోట్లు. మార్కెట్‌లో 40 శాతం లాభానికి వాటిని విక్రయించారు. అంటే రూ.50 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. దీనిలో సింహ భాగం అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన వైసీపీ నేతకు అందినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజిలెన్స్‌ తనిఖీల్లో ఇప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థలం యజమానులకు తెలియకుండానే బాండ్లు జారీ అయిన విషయాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వీటి జారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై అధికారులు దృష్టి పెట్టారు. నిజానికి వైసీపీ హయాంలో జారీ అయిన 16 బాండ్లలో కొద్దిపాటి సొమ్మును స్థలం యజమానులకు ఇచ్చి సంతృప్తి పరిచారు. మరో రెండు బాండ్ల విషయంలో మాత్రం యజమానులకు పైసా ప్రయోజనం చేకూరలేదు. విజిలెన్స్‌ తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమైంది. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని తాళ్ల ముదునూరుపాడులో 69/1, 69/2 సర్వే నెంబర్‌లో 1,333 చదరపు గజాల స్థలాన్ని ముగ్గురు మహిళలు మున్సిపాలిటీకి గిఫ్ట్‌ డీడ్‌గా రాసిచ్చారు. సదరు సర్వే నెంబర్లలో దాదాపు 3,450 చదరపు గజాల స్థలం ఉంది. తాడేపల్లిగూడెం-భీమవరం మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలో 1,333 గజాల స్థలం ఉందంటూ మున్సిపాలిటీకి 2022లో గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చారు.


అప్పట్లోనే మిగిలిన స్థలంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి బిల్డర్‌తో ఒప్పందం చేసుకున్నారు. మున్సిపాలిటీకి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌లో జారీ అయ్యే బాండ్లను అపార్ట్‌మెంట్‌కు ఉపయోగించేలా బిల్డర్‌తో ఒప్పందం కుదిరింది. అక్కడ గజం స్థలం రిజిస్ర్టేషన్‌ విలువను రూ.56 వేలుగా నిర్ధారించారు. దీనికి నాలుగు రెట్లు విలువైన టీడీఆర్‌ బాండ్లను 2022లోనే మున్సిపాలిటీ జారీచేసింది. వాటి విలువ రూ.29.85 కోట్లు వరకు ఉంటుంది. అయితే, అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి వాటిని ఉపయోగించలేదు. మార్కెట్‌లో 40 శాతం ధరకు విక్రయించుకున్నారు. సుమారు రూ.12 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఆ మొత్తం బిల్డర్‌ లబ్ధి పొందారని ఇప్పటి వరకు మహిళలు అనుమానిస్తూ వచ్చారు. కానీ, విజిలెన్స్‌ తనిఖీల్లో బిల్డర్‌కు తెలియకుండానే బాండ్లు జారీ అయినట్టు స్పష్టమైంది. ఈ వ్యవహారంలో భీమవరం పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. బిల్డర్‌కు రూ.3 కోట్లు అప్పగించడంతో బిల్డర్‌ నోరు మెదపలేదు. మిగిలిన రూ.9 కోట్లలో సింహభాగం మాజీ మంత్రికి ముట్టినట్టు సమాచారం. స్థలం యజమానులకు, బిల్డర్‌కు తెలియకుండా బాండ్లు జారీ అయిన విషయంపైనే ఇప్పుడు విజిలెన్స్‌ దృష్టి పెట్టింది.


మహిళలకు అన్యాయం

తాళ్లముదునూరుపాడులో సొంత స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చిన ముగ్గురు మహిళలకు పూర్తిగా అన్యాయం జరిగినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. వారం రోజులుగా తాడేపల్లిగూడెంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. మహిళల పేరుతో ఉన్న స్థలానికి బాండ్లు జారీ అయిన విషయం తనకు తెలియదంటూ బిల్డర్‌.. విజిలెన్స్‌కు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీకి చెందిన మాజీ మంత్రి ప్రధాన హస్తం ఉందని అధికార యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. విజిలెన్స్‌ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధమవుతోంది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ దర్యాప్తు జరగనుంది.

Updated Date - Feb 20 , 2025 | 03:51 AM