Nara Lokesh: విశాఖకు వస్తున్నాం
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:44 AM
విశాఖపట్నంలో మరో దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడుగుపెడుతోంది. తాము విశాఖకు వస్తున్నాం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు గురువారం పెద్ద శుభవార్త చెప్పింది.

2029 నాటికి తొలిదశ పూర్తి
ప్రకటించిన సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్
కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ‘స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్’ నిర్మాణం
2026 తొలినాళ్లలో కార్యకలాపాలు మొదలు
8 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు
సన్‌రైజ్ రాష్ట్రానికి స్వాగతం: లోకేశ్
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో మరో దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడుగుపెడుతోంది. తాము విశాఖకు వస్తున్నాం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు గురువారం పెద్ద శుభవార్త చెప్పింది. విశాఖపట్నానికి తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నామని ఆపోస్టులో ప్రకటించింది. విశాఖలో కొత్త ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్యాంపస్’ (అత్యంత ఆధునికమైన, నూతన సాంకేతికతతో కూడిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కలిగిన క్యాంప్‌స)ను ప్రారంభిస్తున్నామని వెల్లడించింది. ‘‘విశాఖపట్నంలో కొత్త అత్యాధునిక కాం్యప్‌సను ఏర్పాటు చేస్తున్నాం. అది కాపులుప్పాడలోని ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రధానంగా కొత్తగా 8,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
2026 ప్రారంభంలో కార్యకలాపాలు మొదలవుతాయి. 2029 ప్రారంభం నాటికి తొలిదశ పూర్తవుతుంది’’ అని ఆ పోస్టులో వెల్లడించింది. ఇది ప్రాంతీయ టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ డెలివరీలో తమ అధునాతన సామర్థ్యాలను పెంచుతుందని కాగ్నిజెంట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యున్నత నైపుణ్యం కలిగిన యువతను ఎంపిక చేసుకుంటున్నామని పేర్కొంది. తమ విస్తరణలో భాగస్వాములైన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపింది.
కాగ్నిజెంట్‌కు ధన్యవాదాలు: లోకేశ్
సన్‌రైజ్ రాష్ట్రానికి కాగ్నిజెంట్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. భవిష్యత్తు కార్యకలాపాల కోసం విశాఖను ఎంచుకున్నందుకు ఆ సంస్థకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర యువతలో విశ్వాసాన్ని పెంచేలా అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి ఆవిష్కరణ, ఉపాధిశక్తి కేంద్రంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. మెరుగైన అవకాశాలు కల్పిస్తూ, వృద్ధిని పెంచుతూ ప్రజలకు మంచి భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. మరిన్ని మెరుగైన ఫలితాలు కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.