AP Govt: ఏడాది సంబరం
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:41 AM
ఐదేళ్ల విధ్వంసానికి తెరపడి... బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు పడి... నేటికి ఏడాది! జగన్ విధ్వంస పాలనకు జనం చరమ గీతం పలికి... కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది!

కూటమి కొలువుదీరి నేటికి సంవత్సరం
గాడిన పడుతున్న రాష్ట్ర ప్రగతి
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం
పల్లె సీమల్లో పనుల పండగ
రాష్ట్రాన్ని నిలబెడుతున్న కేంద్రం చేయూత
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఐదేళ్ల విధ్వంసానికి తెరపడి... బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు పడి... నేటికి ఏడాది! జగన్ విధ్వంస పాలనకు జనం చరమ గీతం పలికి... కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది! మూడు ముక్కలాటలో... ముడుపుల యావలో... అరాచకాల అజెండాతో విసిగి వేసారిన ‘ఆంధ్రప్రదేశ్’ భవిష్యత్తుపై ఆశలు చిగురించిన రోజిది! ఎన్నికల్లో ‘సూపర్ హిట్’ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ పాలన జరిగిన ఐదేళ్లలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి పోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది... రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ అజెండాతో అడుగులు వేస్తోంది. ఈ ఏడాదిలో కూటమి సర్కారు సాధించిందేమిటి? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయాణం ఎలా సాగుతోంది?
‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సమగ్ర విశ్లేషణాత్మక కథనం...
పల్లెలకు పండగ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.990 కోట్ల నిధులను కేటాయించారు. రూ.4500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు పూయించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 884 కిలోమీటర్ల సిమెంట్లు రోడ్లు వేసింది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 4వేల కిలోమీటర్ల దారులు వేసి... ‘పల్లె పండుగ’ చేసింది.
13,218 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నమోదు చేశారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా 20వేలకుపైగా గ్రామీణ పేదలకు ‘మినీ గోకులాలు’ నిర్మించి ఇచ్చారు. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో 20వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు.
పంచాయతీరాజ్‌లో ‘రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్’ అమలులో ఐదేళ్లూ 26వ స్థానంలో ఉన్న రాష్ట్రం... కూటమి పాలనలో పదేళ్లలోనే రెండో స్థానంలోకి వచ్చింది.
అభివృద్ధి... పారిశ్రామిక ప్రగతి
ఐదేళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. రాజధానిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. జగన్ ‘రివర్స్’ ప్రయోగాలతో దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టుకు నేడు పనుల కళ వచ్చింది. పల్లెల్లో ప్రగతి వికసిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాక మొదలైంది. 78 ప్రాజెక్టుల ద్వారా రూ.9.20 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటితో 5.70 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, శ్రీసిటీలో రూ.5వేల కోట్లతో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమకు, రూ.65 వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లకు శంకుస్థాపన జరిగింది. అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రానుండగా, రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో బీసీపీఎల్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 42 చోట్ల పనులు ప్రారంభం అయ్యాయి.
బూతులకు చెక్...
వైసీపీ ఐదేళ్లూ... బూతులు రాజ్యమేలాయి. నాడు మంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకు బూతులు మాట్లాడటంలో పోటీలు పడేవారు.బూతులు మాట్లాడిన వాళ్లకే ప్రాధాన్యం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సొంత పార్టీ వారైనా సరే... నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. చేబ్రోలు కిరణ్‌కుమార్ అరెస్టే దీనికి నిదర్శనం.
తొలగిన భయాలు
గత వైసీపీ పాలకులు అహేతుక విధానాలు, అరాచక చట్టాలతో ప్రజలను బెంబేలెత్తించారు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానమైనది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశారు. ప్రజలకు భారంగా మారిన చెత్తపన్ను రద్దు చేశారు. జె-బ్రాండ్లకు చెల్లుచీటి రాసి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చారు. జీతాలు ఎప్పుడు పడతాయో అనే టెన్షన్ పోయింది. 1న ఠంచనుగా జీతాలు వేస్తున్నారు.
కేంద్ర పథకాలకు ‘ప్రయోజనం’
వైసీపీ పభ్రుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకపోవడంతో ఆగిన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ మళ్లీ మొదలయ్యాయి. రూ.14,497 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి... 82 కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం పోతూ పోతూ 1.37 లక్షల కోట్లబిల్లులు పెండింగ్‌లో పెట్టింది. ఇందులో కూటమి సర్కారు రూ.20వేల కోట్లు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లు, సప్లయర్లను ఆదుకుంది.
నరక దారులకు నగిషీలు
వైసీపీ హయాంలో రోడ్లు నరకానికి దారులుగా మారాయి. తట్టెడు మట్టి కూడా పోయకపోవడంతో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. కూటమి అధికారంలోకి రాగానే....రోడ్లపై గుంతలు పూడ్చే పనులు చేపట్టింది. ఏడాది కాలంలో రూ.1800 కోట్లు ఖర్చు చేసి 26వేల కిలోమీటర్ల రోడ్లు బాగు చేశారు. 1700ల కిలోమీటర్ల స్టేట్ హైవేలను పీపీపీ విధానంలో అభివృద్ధి, విస్తరణకు ఆమోదం తెలిపారు.
మరకలూ ఉన్నాయి...
వైసీపీ హయాంలో సెంటు స్థలం పేరుతో పేదలను మభ్యపెట్టారు. నివాసయోగ్యం కాని స్థలాలను అంటగట్టి నాటి పాలకులు చేతులు దులిపేసుకున్నారు. టీడీపీ హయాంలో పూర్తి చేసిన ఇళ్లనూ లబ్ధిదారులకు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇళ్లు ఇస్తారని చాలామంది పేదలు ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగాల కల్పన, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం వంటి కీలక అంశాల్లో గణనీయమైన పురోగతిని ప్రజలు ఆశిస్తున్నారు.
పలు హామీల అమలులో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
కూటమి సర్కార్‌లోని కొందరు మంత్రులు చేస్తున్న అవినీతి పనులు.. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేల తీరు కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉంది.
రాష్ట్ర సంకల్పం.. కేంద్ర సహకారం
ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో... రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. ఈ పరిస్థితులను చంద్రబాబు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు.
రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,400 కోట్లు సాధించారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలకు కేంద్రం రూ.5వేల కోట్లు కేటాయించింది.
విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేయడంతోపాటు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూసింది.
రూ.72వేల కోట్ల హైవే ప్రాజెక్టులు.. రూ.70 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతికి కేంద్రం పచ్చజెండా ఊపింది.
రూ.2245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైను మంజూరు చేసింది.
చెప్పిన మాట...ఇచ్చిన హామీ!
ఎన్నికల సమయలో ఇచ్చిన హామీలను కూటమి సర్కారు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
వృద్ధ్యాప్య, వికలాంగ పింఛన్ల పెంపు హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. ప్రతి నెలా 64లక్షల మందికి రూ.2720 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తోంది.
16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ నియామక పరీక్షలు జరుగుతున్నాయి.
దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. ఇప్పటికి కోటి సిలిండర్లు డెలివరీ చేయగా, తొలి ఏడాది రూ.2684 కోట్లు ఖర్చు చేశారు.
మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశారు. ‘మత్స్యకారుల సేవ’లో పథకం ద్వారా రూ.20వేల ఆర్థిక సాయం కింద రూ.259 కోట్లు ఇప్పటికే అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. మరో 61 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
దీంతోపాటు 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని తీసుకొచ్చారు.
ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చారు.
ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని కూడా అమలు చేయనున్నారు.
‘ఏడాది పండగ’ సందర్భంగా గురువారం ‘తల్లికి వందనం’ నిధులు అమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి రానుంది.
ఏడాదిలో మెరుపులు ఇవీ..
వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టారు. తద్వారా సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధను తగ్గించి, పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర పథకాలను పక్క దారి పట్టించారు. కూటమి అధికారంలోకి రాగానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో బీసీల కోసం రూ.47456 కోట్లు కేటాయించి బీసీల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. దీంతోపాటు దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలను రూ.25వేలుకు పెంచారు.
చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశారు. పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, హ్యాండ్‌ల్యూమ్స్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయించడంతోపాటు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేయడంతోపాటు యాప్‌ల భారం తొలగించారు.
ఉద్యోగులకు ఏడాది కాలంలో రూ.7500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేశారు. పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేశారు. అంగన్వాడీలు, ఆశాలకు రూ.1.5 లక్షల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు.
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో 5 చోట్ల రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో టీసీఎస్‌తో ఒప్పందం చేసుకుని భూమి కేటాయించారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీకి భూములు కేటాయించారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. రైతులకు మళ్లీ 90శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభించారు. పాడి రైతుల కోసం రూ.2 లక్షల సబ్సిడీతో షెడ్లు నిర్మాణానికి ఆమోదం తెలిపారు.