CM Chandrababu Invites Arvind Panagariya: పోలవరం ప్రారంభోత్సవానికి రండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:24 AM
పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు, 2027 గోదావరి పుష్కరాలకింద ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం-బనకచర్ల పథకం రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని చెప్పారు

పనగారియాకు సీఎం వినతి.. పుష్కరాల్లోపే ప్రాజెక్టును పూర్తిచేస్తాం
మీరు నీతి ఆయోగ్‌లో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు
72% పనులు పూర్తిచేశాం.. ‘బనకచర్ల’ రాష్ట్రానికి గేమ్ చేంజర్
అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం కంటే రాష్ట్రంలో అంతర్గత సంధానంతోనే మేలు.. ఆర్థిక సంఘం చైర్మన్‌తో ముఖ్యమంత్రి
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు (2027 జూలై23-ఆగస్టు 3) ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాను ఆహ్వానించారు. పోలవరం-బనకచర్ల పథకం రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని.. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో దుర్భిక్షం దూరమవుతుందని తెలిపారు. ఈ పథకం ప్రయోజనాలను ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పోలవరంపై పనగారియా ఆరా తీశారు. గతంలో తాను నీతి ఆయోగ్‌లో బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఈ ప్రాజెక్టును సందర్శించానని గుర్తు చేశారు. తనకు దీనిపై పూర్తి అవగాహన ఉందన్నారు. సీఎం స్పందిస్తూ.. ప్రాజెక్టు పనులు రాష్ట్రమే చేపడితే బాగుంటుందని.. త్వరితగతిన పూర్తవుతుందంటూ గతంలో పనగారియా చేసిన సూచన మేరకే రాష్ట్రప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పారు. ‘ఆయన నీతి ఆయోగ్‌లో పనిచేసిన సమయంలోనే ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు
. దేశంలో ఉన్న ఇతర జాతీయ ప్రాజెక్టుల పురోగతి మందగించడంతో పోలవరం పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని సిఫారసు చేశారు. దీంతో పనులు చేపట్టి 2014-19 నడుమ 72 శాతం మేర హెడ్‌వర్క్స్ పూర్తి చేశాం. 2019లో ప్రభుత్వ మార్పిడి జరిగి ఉండకపోతే.. పోలవరం 2020 నాటికే పూర్తయ్యేది’ అని చెప్పారు. పోలవరం-బనకచర్ల పథకం రాష్ట్ర అంతర్గత ప్రాజెక్టుగా ఉంటుందన్నారు. నదుల అనుసంధానం వివిధ రాష్ట్రాల గుండా చేపడితే.. సాంకేతిక సమస్యలతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు కూడా వస్తున్నాయని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా రాష్ట్ర అంతర్గత నదుల అనుసంధానానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
Read Also: Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్
ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు