Share News

APSRTC: ఇక ఈవీ బస్సులే

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:08 AM

ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ర్టిక్‌ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

 APSRTC: ఇక ఈవీ బస్సులే

  • ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెరగాలి.. అవి ఎలక్ర్టిక్‌ వాహనాలై ఉండాలి

  • ఆక్యుపెన్సీ పెంచేలా చర్యలు తీసుకోవాలి.. సీఎం ఆదేశాలు

  • ఆగస్టు 15 నుంచే మహిళలకు ఉచిత ప్రయాణమని స్పష్టీకరణ

  • మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రాజెక్టులకు మరిన్ని నిధులు సమీకరించాలి

  • ఏఐఐబీ, యూఐడీఎఫ్‌ పనుల్లో ఏ మాత్రం జాప్యం జరగకూడదు

  • మున్సిపల్‌ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నిర్దేశం

కేంద్ర ప్రాజెక్టులకు మరిన్ని నిధులు తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించాలి. పెండింగ్‌ బిల్లులు, ఇతర విషయాల్లో మున్సిపల్‌, ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేయాలి. గత ప్రభుత్వం వివిధ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో చాలా నిధులు రాలేదు. ఇప్పుడా పరిస్థితి తలెత్తకూడదు. ఏఐఐబీ, స్వచ్ఛ భారత్‌ నిధులతో పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.

- మున్సిపల్‌ శాఖ సమీక్షలో సీఎం

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ర్టిక్‌ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్థికంగా భారమైనా.. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు శనివారం ప్రజారవాణాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలను చేశారు. ఆక్యుపెన్సీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని నిర్దేశించారు.


ఇప్పటికే ఆర్టీసీ వద్ద ఉన్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కేంద్రం ఇచ్చే 750 ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు.. ఆర్టీసీ బస్టాండ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. వీలైనన్ని విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేయాలని, సాధ్యం కాని పక్షంలో అద్దె బస్సులు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఎన్నికల సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ప్రయాణ పథకాల్లో ఏపీనే ఉత్తమంగా ఉండాలన్నారు. ఏపీఎ్‌సఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకుని, వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఉచిత ప్రయాణం అమలు తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మరో 2,536 బస్సులు అవసరమని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. రాష్ట్రంలో 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా ప్రయాణిస్తారని, ఏడాదిలో 88.9 కోట్ల ప్రయాణాలు మహిళలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. ఆర్టీసీపై ఏటా రూ.996 కోట్ల మేర ఉచిత ప్రయాణ భారం పడే అవకాశం ఉందని వివరించారు.


పెండింగ్‌ బిల్లులు, యూసీల సమస్యలు పరిష్కరించాలి

అలాగే.. మున్సిపల్‌ శాఖపై కూడా సీఎం చంద్రబాబు విడిగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ శాఖ పరిధిలో కేంద్ర ప్రాజెక్టులు ఏమున్నాయో చూసుకుని.. వాటికి మరిన్ని నిధులు ఏ విధంగా తీసుకురావాలనే దానిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా బిల్లులు పెండింగ్‌ ఉన్నా.. యూసీల విషయంలో ఏమైనా సమస్యలున్నా.. వాటిని ఆర్థిక శాఖతో సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఆర్థిక శాఖ కూడా మున్సిపల్‌ శాఖకు సహకరించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వివిధ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో చాలా నిధులు రాలేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ఏఐఐబీ నుంచి వచ్చిన రూ.5,800 కోట్లు, స్వచ్ఛ భారత్‌ కింద వచ్చిన రూ.3 వేల కోట్లతో పనులు వేగంగా జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమృత్‌, అమృత్‌-2, ఏఐఐబీ, యూఐడీఎఫ్‌ ప్రాజెక్టుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు.


ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి

మున్సిపల్‌ శాఖ పరిధిలో ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని ఆస్తవ్యస్తం చేసిందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. అర్బన్‌ హౌసింగ్‌ విభాగాన్ని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని, వైసీపీ హయాంలో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. పలు సమస్యలున్నాయని, త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా నీటి శుద్ధి అంశంపై మరింత దృష్టి సారించి, ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. లెగసీ వేస్ట్‌ అనేది మున్సిపాలిటీలకు, ప్రజలకు భారంగా మారిందని, లెగసీ వేస్ట్‌ కనిపించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో చెత్తను ఎప్పటికప్పుడు డిస్పోజ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


డ్వాక్రా ఉత్పత్తులకు డిమాండ్‌ పెంచాలి

డ్వాక్రా సంఘాల ద్వారా మహిళాభివృద్ధి జరుగుతుందని సీఎం అన్నారు. ‘డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మరింత డిమాండ్‌ పెరిగేలా చేయాలి. దీనికి అవసరమైన నైపుణ్య శిక్షణను నిరంతరం అందించాలి. డ్వాక్రా మహిళల ఆదాయం పెరగాలి’ అని అధికారులను నిర్దేశించారు. వారి జీవన ప్రమాణాలను పెంచే దిశగా మెప్మా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ-కామర్స్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించేలా చూడాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించడంతో పాటు మనం ఆయా మున్సిపాలిటీలకు ఎంత ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించాలని ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్‌ మంత్రి నారాయణ, మున్సిపల్‌, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 04:08 AM