AP CM Chandrababu: వైద్య ఖర్చులు తగ్గించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:36 AM
ఆస్పత్రి ఖర్చులు తగ్గించడం ప్రజల జీవితం మెరుగుపరిచే కీలకం అని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు అవసరమని చెప్పారు

ప్రజల జీవితాల్లో అదే పెద్ద గేమ్ చేంజర్
వైద్య రంగానికి టెక్నాలజీ జోడిస్తే విప్లవాత్మక మార్పులు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ
విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల దాతృత్వానికి స్ఫూర్తి: చంద్రబాబు
పూర్వ విద్యార్థులు 50 కోట్లతో నిర్మించిన సెంటినరీ భవనం ప్రారంభం
విశాఖపట్నం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ.50 కోట్ల విరాళాలతో నిర్మించిన సెంటినరీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతికపరంగా అందివచ్చిన నైపుణ్యంతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని, దీనికి ఆంధ్ర వైద్య కళాశాల పూర్తిగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం, ఇతర వివరాలతో కూడిన డేటా, రియల్ టైమ్ డేటా ఉన్నాయని, వాటిని ఏఐ టూల్‌తో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర డేటా తయారు చేస్తున్నామని వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. వచ్చే పదేళ్లలో వచ్చే మార్పులను ఇప్పుడే అంచనా వేసి, అందుకు తగినట్టుగా ఆవిష్కరణలు చేయాలన్నారు. అన్నిరంగాల మాదిరిగా వైద్యరంగంలో అనేక మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సులు చేస్తే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అలా్ట్ర సెన్సార్ సాయం తో ప్రతిరోజు తాను ఆహారం తీసుకుంటున్నానని, రోజూ తినే ఆహారాన్ని మెడిసిన్‌గా.. వం టిల్లును ఫార్మసీగా పరిగణించాలని అన్నారు. ఆరోగ్యం మనచేతిలోనే ఉందన్నారు.
జన్మభూమి స్ఫూర్తితో..
జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ.50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు, విజ్ఞానం అందించే భవనం నిర్మాణం చేపట్టారని అభినందించారు. దేశంలో 100 ఏళ్లు పైబడిన ఏడు కళాశాలల్లో ఇది ఒకటి కావడం గర్వకారణమన్నారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళాలతో అక్కడ భవనాలు నిర్మిస్తున్నారని, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు రూ.40 కోట్లు సేకరించి భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. ఇంకా కర్నూలు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థులు తమ సంస్థలకు విరాళాలు సమీకరించారని, వారందరికీ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు.
బ్రెయిన్ గెయిన్‌గా...
1995లో టెక్నాలజీ గురించి తాను మాట్లాడితే అందరూ వింతగా చూశారని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఐటీ రంగంలో ఇప్పుడు ఎక్కువ తలసరి ఆదాయం తెస్తున్నది భారతీయులైతే, వారిలో 33 శాతం తెలుగువారేనని అన్నారు. సమాజంలో వైద్యులు, పోలీసులు ఎక్కువగా కష్టపడతారన్నారు. గతంలో ఏపీ నుంచి అనేక మంది వైద్యులు విదేశాలకు వలస వెళ్లేవారని అప్పట్లో దానిని బ్రెయిన్ డ్రెయిన్ అనేవారని, చాలాకాలం తరువాత అది బ్రెయిన్ గెయిన్‌గా మారిందని, అందుకు అపోలో ప్రతా్‌పరెడ్డి ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:
విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?
For More Andhra Pradesh News and Telugu News..