Share News

Elephants: ఏనుగులను ట్రాక్ చేయడానికి డ్రోన్ల వినియోగం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:37 AM

అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.

Elephants: ఏనుగులను ట్రాక్ చేయడానికి డ్రోన్ల వినియోగం
గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు

ఎర్రావారిపాలెం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఈ వివరాల ఆధారంగా ట్రాకర్ల ద్వారా ఏనుగులను దారి మళ్లించడంతో పాటు సమీప ప్రజలను అప్రమత్తం చేస్తారు. శేషాచల అడవుల్లో నుంచి ఏనుగులు వేసవి రాగానే పంట పొలాలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. ట్రాకర్లతోను, రైతులూ దండుగా వెళ్ళి అరచి, క్రాకర్స్‌ పేల్చి బెదిరిస్తే గతంలో ఏనుగులు అడవిలోకి వెళ్లేవి. ఇప్పుడు తిరగబడుతున్నాయి. తాజాగా ఓ రైతును తొక్కి చంపాయి. ఈ క్రమంలో ఏనుగుల జాడ పసిగట్టి.. వాటిని కట్టడి చేసేందుకు రూ.2.5 లక్షలతో అటవీశాఖ డ్రోన్‌ను కొనుగోలు చేసింది. అర కిలోమీటరు ఎత్తులో ఎగురుతూ 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఏనుగుల కదలికలు, పొదల్లో నక్కి ఉన్నా లైవ్‌ విజువల్‌ పంపుతుంది. అడవుల్లోకి ఏనుగులను తరుముతున్నప్పుడు (డ్రైవ్‌) ముందుకే పోతున్నాయా? ఎదురు తిరుగుతున్నాయా? నెమ్మదిగా పోతున్నాయా? ఆ గుంపులో గున్నలు ఉన్నాయా అనేది తెలుసుకుని సులభంగా డ్రైవ్‌ చేయొచ్చని అధికారులు అంటున్నారు. భాకరాపేట రేంజర్‌ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ డ్రోన్‌ను తొలిసారిగా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పంచాయతీలోని పొలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. తలకోన సౌత్‌ బీట్‌ పరిధిలో ఏనుగుల కదలికలను ఈ డ్రోన్‌ సాయంతో గుర్తించి అక్కడి రైతులను అప్రమత్తం చేశారు.

Updated Date - Apr 30 , 2025 | 12:37 AM