Share News

Counseling: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:49 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించారు.

Counseling: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఇన్‌చార్జి పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర రెడ్డి తదితరులు

చిత్తూరు సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో ఇన్‌చార్జి పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్‌, మదనపల్లె ఈఈ చంద్రశేఖర రెడ్డి సమక్షంలో కౌన్సెలింగ్‌ జరిగింది. ఉమ్మడి జిల్లాలో 664 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ఉండగా ఆదివారం 400 మందికి బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మిగిలినవారికి సోమవారం ఉంటుంది. కాగా, కౌన్సెలింగ్‌ ప్రారంభంలో ఉద్యోగులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఖాళీగా ఉన్న ప్రాంతాల వివరాలు ప్రదర్శించాలని ఉద్యోగులు కోరారు. ఖాళీగా ఉన్నా.. తాము కోరుకున్న చోటు కాకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపిస్తూ కొంతసేపు ఆందోళన చేశారు. ఖాళీలను ప్రదర్శించడానికి పెద్ద డిజిటల్‌ స్ర్కీన్లు తమ వద్ద లేవని అధికారులు చెప్పడంతో ఉద్యోగులు అసంతృప్తిగానే కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు.

మహిళా పోలీసుల కౌన్సెలింగ్‌లో రగడ

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు మహిళా పోలీసుల బదిలీ కౌన్సెలింగ్‌లో రగడ చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక పీటీసీ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తయిన సుమారు 1,200 మంది మహిళా పోలీసులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. ఎస్పీ మణికంఠ పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ ద్వారా ఖాళీల వివరాలను చూపించి బదిలీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. తొలుత అంధులు, విడోలు, స్పౌజ్‌, దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ కేటగిరీల్లోని వారికి బదిలీలు చేపట్టారు. ఇది సరికాదని, ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.


ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వేయడంతో ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని జిల్లాల్లో ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపట్టారని, పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేస్తున్నామని చెప్పారు. ఆందోళనలు చేయాలనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో అందరూ మిన్నకుండిపోయారు. ఆదివారం మిగిలినవారికి సోమవారం కూడా బదిలీ కౌన్సెలింగ్‌ జరుగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - Jun 30 , 2025 | 01:49 AM