Tirumala Darshan: శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారో తెలుసా
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:42 AM
Tirumala Darshan: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుంది. శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల, ఏప్రిల్ 21: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడిని (Tirumala Temple) దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పరీక్షలు అయిపోవడంతో పాటు వేసవి సెలవులు వచ్చేయడంతో చాలా మంది తిరుమల బాట పట్టారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ గోవిందుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు అధికంగా తరలిరావడంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతోంది.
అలాగే వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉండనుంది. ఇక నిన్న (ఆదివారం) వారాంతం కావడంతో తిరుమల శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 25,078 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.85కోట్ల ఆదాయం వచ్చింది.
ఉదయం సేవలు:
ఈరోజు (సోమవారం) తెల్లవారుజాము నుంచే తిరుమలేశుడికి పలు సేవలు నిర్వహించారు అర్చకులు. సుప్రభాత సేవ, తోమాల సేవ, ఏకాంత సేవ, తొలి అర్చన, సహస్ర నామ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు శ్రీవారికి విశేష పూజ చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. రాత్రి ఏడు గంటల వరకు గోవిందుడిని దర్శించుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉంజల్ సేవలు నిర్వహించనున్నారు.
సాయంత్రం సేవలు ఇవే...
సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటలకు: సహస్ర దీపాలంకరణ సేవ
సాయంత్రం 7:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకు: కైంకర్యం సేవ
రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు: శుద్ధి ఏకాంత సేవ
అర్థరాత్రి 1:30 గంటలకు: ఏకాంత సేవ నిర్వహిస్తారు అర్చకులు
తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు
మరోవైపు తిరుమల కొండకు భక్తులు భారీగా తరలిరావడంతో తిరుమల ఘాట్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పెడుతోంది. అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి దాదాపు 10 వేల వాహనాలు తిరుమల కొండకు వెళ్తున్నట్లు టీటీడీ గుర్తించింది. ఈ క్రమంలో తిరుమల ఘాట్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య ఇబ్బందులకు గురిచేస్తోంది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో పర్యావరణ సమస్య కూడా తలెత్తుతోంది. గోవింద నామాలు వినపడాల్సిన చోట వాహనాల శబ్ధం, హారన్ సౌండ్స్ వినబడుతున్న పరిస్థితి. దీంతో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. విజన్ 2047లో భాగంగా టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరి వద్ద దాదాపు 15 హెక్టార్లలో బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టనుంది టీటీడీ. దాదాపు 25 వేల మంది భక్తులకు సరిపడా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనలో ఉంది టీటీడీ. అందులో భాగంగా తిరుమల కొండకు చేరే భక్తులను అలిపిరి నుంచే నియంత్రించాలని ప్లాన్ చేసిన టీటీడీ బేస్ క్యాంప్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
అలిపిరి వద్ద పరిస్థితి ఇదీ
ఇదిలా ఉండగా.. అలిపిరి టోల్‌గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఇదంతా కూడా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల ప్రభావం అని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. వీఐపీ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు అన్ని ఉదయం వేళలో ఉండడంతో అలిపిరి వద్ద రద్దీ అధికంగా ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాని సమయం మార్చాలని భక్తులు కోరుతున్నారు. అలిపిరి నుంచి చెక్ పాయింట్ దాటడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. దీంతో చిన్న బిడ్డలు, వృద్ధులు ఉన్న భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి
Gold Record Price: వాణిజ్య యుద్ధం వార్..ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు
Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి
Read Latest AP News And Telugu News