Coconuts: వంద టెంకాయలు రూ.2,500
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:22 AM
కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

పాలసముద్రం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పాలసముద్రం మండలంలో సుమారు మూడువేల ఎకరాల్లో విస్తారంగా కొబ్బరి తోటలున్నాయి. రెండు నెలలుగా కొబ్బరి ధరలు పెరుగుతూ ప్రస్తుతం వంద రూ.2,500లకు చేరుకున్నాయి. రెండు నెలల కిందట వంద కొబ్బరి కాయలు రూ.15,00 పలికేవి. అదే రెండేళ్ల కిందట అయితే రూ.800-850 మధ్య ధరలు ఉండేవి. తమిళనాడు, కేరళ, మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పిందెనల్లి తెగులు కారణంగా దిగుబడి తగ్గింది. దీనివల్లే ధరలు పెరిగినట్లు సమాచారం. మండలం నుంచి కొబ్బరికాయలను తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, రాణిపేట, తిరుత్తణి, షోలింగర్ వంటి ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఎండు కొబ్బరి కిలో రూ.250 ధర పలుకుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో ధరలు పలుకుతుండటంతో కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.