Share News

Loss: ప్రాథమిక నష్టం అంచనా రూ.38.21 కోట్లు

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:13 AM

మూడు రోజులపాటు ప్రజలను అవస్థలకు గురిచేసింది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో తుఫాన్‌ తీవ్రత లేకున్నా నష్టాన్ని మాత్రం ఓ మాదిరిగా మిగిల్చింది. ఇలా జిల్లాలో మొంథా వల్ల కలిగిన నష్టం రూ.38.21 కోట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Loss: ప్రాథమిక నష్టం అంచనా రూ.38.21 కోట్లు
పాకాల మండలం ఒడ్డిపల్లెలో వరిపైరులోకి చేరిన వర్షపునీరు - నారాయణవనం మండలం తుంబూరు వద్ద దెబ్బతిన్న కాజ్‌వే

వాస్తవానికి కావాల్సింది రూ.300 కోట్లకుపైనే

తిరుపతి(కలెక్టరేట్‌), ఆంధ్రజ్యోతి: మూడు రోజులపాటు ప్రజలను అవస్థలకు గురిచేసింది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో తుఫాన్‌ తీవ్రత లేకున్నా నష్టాన్ని మాత్రం ఓ మాదిరిగా మిగిల్చింది. ఇలా జిల్లాలో మొంథా వల్ల కలిగిన నష్టం రూ.38.21 కోట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను పరిశీలించి, బాధితులను గుర్తించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎందుకంత ఆలస్యం?

తుఫాన్‌ నష్ట అంచనా వివరాలను సేకరించడంలో జాప్యం జరుగుతోంది. మంగళవారం నాటికే జిల్లాలో వర్షాలు నిలిచినా బుధ, గురువారాల్లోనూ తుఫాన్‌ నష్టం అంచనా పూర్తి కాలేదు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ క్షేత్రస్థాయిలో తిరిగి తుఫాన్‌నష్ట వివరాలను త్వరగా పంపాలని ఆదేశించినా, వీడియో కాన్ఫరెన్సు పెట్టి పదే పదే తెలిపినా కొన్నిశాఖల్లో తుఫాన్‌ నష్టాన్ని అంచనా వేయడంలో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు తుఫాన్‌ ప్రభావం పోయి రెండు రోజులైనా 50శాతం కూడా జిల్లా అధికారులు నివేదికలు సిద్ధం చేయకపోవడం గమనార్హం.

కావాల్సింది రూ.300 కోట్లు పైమాటే

ప్రాథమికంగా తుఫాన్‌ నష్టాన్ని రూ.38.21 కోట్లుగా అంచనా వేసినా, వాస్తవానికి రూ.300 కోట్లకుపైనే కావాల్సి ఉంటుందని అధికార యంత్రాంగం చెబుతోంది. ఉదాహరణకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌లో కిలోమీటరు రోడ్డు వేయడానికి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు అవసరం. ఈ లెక్కన రెండు శాఖలకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులకు కావాల్సింది రూ.40 కోట్లకుపైనే. కానీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం కిలోమీటరుకు రూ.60-70వేలు చూపుతుంది. దీంతో రూ.5 కోట్ల వరకు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక, జిల్లాలో దెబ్బతిన్న చెరువులకూ రూ.105 కోట్లు అవసరం. ఇలా అన్ని శాఖలు కలిపితే మరమ్మతులకు కావాల్సింది రూ.300 కోట్లు దాటుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, కొన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయి నష్ట వివరాలతో గురువారం రాత్రి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు ప్రజంటేషన్‌ ఇవ్వగా, ఇంకా పలు శాఖల నుంచి తీవ్ర జాప్యం జరుగుతోంది.

నీటిపారుదలశాఖకు రూ.32 కోట్లు నష్టం

జిల్లాలో భారీ వర్షానికి సింహభాగం నీటిపారుదలశాఖకు వచ్చేసరికి రూ.32కోట్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల గట్లు లీకయ్యాయి. ఇక మున్సిపల్‌శాఖకు రూ.18లక్షల మేర నష్టం వాటిల్లింది. ఓపెన్‌ డ్రైన్లు, ఈ తుఫాన్‌ వల్ల పశుసంవర్థకశాఖకు రూ.14లక్షల నష్టం జరిగింది. దాదాపు 78 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఇక తుఫాన్‌ధాటికి 24 ఇళ్లు దెబ్బతినగా పాక్షికంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. 16 పూరిగుడిసెలు దెబ్బతినగా రూ.13లక్షల నష్టం వాటిల్లింది. జిల్లాలో 19మండలాల్లో తుఫాన్‌ ధాటికి నష్టం వాటిల్లింది.


దెబ్బతిన్న రోడ్లు

సాధారణ రోజుల్లో రోడ్లు తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి. తుఫాన్‌ నేపథ్యంలో సుమారు ఐదు రోజులు జిల్లాలో వర్షాలు పడటంతో సుమారు 267 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. జిల్లా మొతంగా 112 రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో 42 రోడ్లు.. సుమారు 129 కిలోమీటర్ల దెబ్బతింది. ఇక పంచాయతీరాజ్‌శాఖకు సంబంఽధించి 70 రోడ్లు.. 138 కిలోమీటర్ల వరకు మరమ్మతులకు గురైంది. రెండు శాఖలకు కలిపి సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

చేతికందిన పంట నేలమట్టం

తుఫాన్‌ వరి రైతులను వెన్ను విరిచింది. రేపో మాపో కోత కోసం పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందామనే సమయంలో వరుస వర్షాలు, గాలుల ధాటికి చేతికి అందిన పంట నేలమట్టమైంది. అత్యధికంగా వరి 94 హెక్టార్లలో, వేరుశనగ 2 హెక్టార్లలో, కాకర, ఇతర ఉద్యానవన పంటలు 1.6హెక్టార్లలో దెబ్బతిన్నాయి.

విద్యుత్‌శాఖకు రూ.57లక్షల షాక్‌

బలమైన ఈదురుగాలులతో విద్యుత్‌శాఖకు రూ.57లక్షల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. విద్యుత్‌ స్తంభాలను ఎప్పటికపుడు పునరుద్ధరించారు.తుఫాన్‌ ప్రభావిత సబ్‌స్టేషన్లు85, దెబ్బతిన్న స్తంభాలు 132, తెగిన విద్యుత్‌ తీగలు 4.55 కిలోమీటర్లు, పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. విద్యుత్‌శాఖకు సుమారు 57.5లక్షలు నష్టం వాటిల్లింది.

Updated Date - Oct 31 , 2025 | 02:13 AM