Farmer: రైతు రాజుగా ఎదగాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:25 AM
వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

2,05,753 మంది రైతుల ఖాతాల్లో రూ.138.16కోట్లు జమ
రొంపిచెర్ల,ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద శనివారం జిల్లాలోని 2,05,753 మంది రైతులకు రూ.138.16 కోట్లు జమయ్యాయి.ఇందుకు సంబంధించి రొంపిచెర్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రైతులకు నమూనా చెక్కు అందజేశారు.అంతకుముందు ఎద్దుల బండిపై పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డితో కలసి సభాస్థలికి మంత్రి చేరుకున్నారు.సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎన్నికల హామీలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో కుటుంభానికి 10 పథకాల లబ్ధి చేరుతోందన్నారు. కలెక్టరు సుమిత్‌కుమార్ మాట్లాడుతూ అన్నదాతలకు గతంలో రూ.13 వేలు ఇచ్చేవారని, ప్రస్తుతం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ 20వేలు ఇస్తున్నారన్నారు.జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఏడీ శివకుమార్, ఏవో శ్రావణి, కురబ కార్పొరేషన్ డైరెక్టరు ఉయ్యాల రమణ, వైస్ ఎంపీపీ నూలు రెడ్డెప్ప, సర్పంచ్ ఇబ్రహీంఖాన్, సోమల మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, సింగిల్‌విండో అధ్యక్షుడు శివశంకర్, బీజేపీ నాయకుడు మాదాల లోకేష్, టీడీపీ నాయకులు ముల్లంగి రమణ, ధనంజయ నాయుడు, మురళీ నాయుడు, మోహన్ నాయుడు, చిన్నబాబు, మణియాదవ్, రమేష్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ ఉమాపతి నాయుడు, జనార్దన్, కొండా మురళి, నాగరాజ, రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో 1,54,980 మంది రైతులకు రూ.105కోట్లు
శ్రీకాళహస్తి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ ఆవరణలో శనివారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు మెగా చెక్కును, విత్తనాల కిట్లను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా తొలివిడత నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 1,54,980 మంది రైతుల ఖాతాల్లో రూ.105కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 90శాతం ఇన్‌పుట్ సబ్సిడీతో యూరియా, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు. క్రాప్ ఇన్సూరెన్సు అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 22వేల మంది రైతులు లబ్ధి పొందారని చెప్పారు. రైతులకు కూలీల సమస్యను నివారించేందుకు పది డ్రోన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.
అనంతరం అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్సు నిర్వహించారు. పథకానికి సంబంధించి సమస్యలు ఉంటే 9552300009 ద్వారా వాట్స్‌పలో వివరాలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాదరావు, రైతు సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.