Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్ వెరైటీస్
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:08 AM
తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్ వెరైటీస్ ఆదుకుంటున్నాయి.

చిత్తూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్ వెరైటీస్ ఆదుకుంటున్నాయి. జిల్లాలో చాలామంది రైతులు తోతాపురితో నష్టాలు చవిచూసినా, రకాల కాయల్ని అమ్ముకుని నష్టాలను తగ్గించుకోగలుగుతున్నారు.జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో తోతాపురి రకం సాగులో ఉండగా.. 40 వేల ఎకరాల్లో టేబుల్ వెరైటీస్ సాగులో ఉన్నాయి. ఈసారి కాపు బాగా రావడంతో తోతాపురి రకం 5 లక్షల టన్నులు, రకాల కాయలు లక్షన్నర టన్నులకుపైగా దిగుబడి ఉంటుందని అంచనా వేశారు.దిగుబడి బాగుందనుకుని సంతోషపడ్డ తోతాపురి ధర పతనం కావడంతో రైతులకు దిక్కుతోచడం లేదు.ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించి ఆదుకున్నా జ్యూస్ ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద కేజీ కాయలకు రూ.2నుంచి రూ.5వరకే రైతుకు దక్కుతోంది. కొన్నేళ్లుగా మామిడి ఉత్పత్తులకు డిమాండ్ లేకుండా పోయింది. దీంతో పల్ప్ నిల్వలు జ్యూస్ ఫ్యాక్టరీల్లో పెద్దఎత్తున మగ్గుతుండడంతో తోతాపురి రకాలకు డిమాండ్ లేకుండాపోయింది. ఇదే సమయంలో రకాల కాయలు సాగు చేసిన రైతులకు లాభాలు దక్కుతున్నాయి.తినడానికి, ఎగుమతులకు పనికొచ్చే ఈ కాయలు దిగుబడి తక్కువైనా మంచి ధర లభిస్తుండడంతో రైతులు సంతోషపడుతున్నారు.వీటికి కూడా సీజన్ దాదాపు పూర్తవుతుండడంతో మంచి ధరలు లభిస్తున్నాయి. మామిడి సాగు ఇప్పటికే ఎక్కువకాగా ఇంకా పెరిగితే ఈ ఏడాది కంటే దారుణమైన పరిస్థితులను రైతులు ఎదుర్కోవాల్సివస్తుందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మామిడి సాగుకు 2007నుంచి ఉపాధిహామీ పథకం తోడ్పడుతుండడంతో రైతులు విపరీతంగా సాగు చేశారు. వచ్చే ఏడాది నుంచి తోతాపురి రకం సాగు చేసుకునేవారికి మాత్రం ఈ ప్రోత్సాహకాలు ఇవ్వకూడదని జిల్లా యంత్రాంగం నిర్ణయించినట్లు సమాచారం.
రకాలతోనే లాభాలు : సుధాకర రెడ్డి, మతుకువారిపల్లె, పులిచెర్ల మండలం
నాకున్న 21 ఎకరాల్లో బేనీషా 10 ఎకరాల్లో సాగు చేశా.25 టన్నుల దిగుబడి వచ్చింది. అలాగే ఖాదర్ 3 ఎకరాల్లో 10 టన్నులు, మల్లిక 3 ఎకరాల్లో 8 టన్నులు, నీలం 2 ఎకరాల్లో 25 టన్నులు, తోతాపురి 3 ఎకరాల్లో 18 టన్నులు దిగుబడి వచ్చింది. బేనీషా కిలో రూ.20, ఖాదర్ రూ.35, మల్లిక రూ.38, నీలం రూ.16 చొప్పున అమ్మి లాభాలు పొందా.తోతాపురికి సబ్సిడీ మినహా ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద ధరల్లేవు.
కవర్లు కట్టడంతో లాభపడ్డా : సుదర్శన్ నాయుడు, గుంతూరు , బంగారుపాళ్యం మండలం
16 ఎకరాల మామిడి తోపులో టేబుల్ వెరైటీస్ కాయలకు కవర్ కట్టా. హిమాంపసంద్ కిలో రూ.120, ఖాదర్ రూ.51, మల్‌గూబ రూ.105, మల్లిక రూ.45, బేనీషా రూ.30నుంచి రూ.45 వరకు అమ్మాను. కలర్ తోతాపురి కాయల్ని కిలో రూ.18కి అమ్మాను. ఐదేళ్లుగా కవర్ కట్టి కాయల్ని మంచి ధరకు అమ్ముకుంటున్నా.గతేడాది కవర్ కట్టిన తోతాపురి రూ.65కు అమ్మాను.
తోతాపురి నష్టం రకాలతోనే పూడింది: కృష్ణమూర్తి, మిట్టపల్లె , తవణంపల్లె మండలం
నాకున్న నాలుగెకరాల్లో హిమాం పసంద్, మల్లిక, బేనీషా వంటి రకాలను ఎకరాలో సాగు చేశా. మిగిలిన మూడెకరాల్లో తోతాపురి కాస్తున్నాయి. ధర లేక తోతాపురితో పూర్తిగా నష్టపోతే, టేబుల్ వెరైటీ్‌సతో సుమారు రూ.1.50 లక్షల ఆదాయం వచ్చింది.
మామిడి రకం సాగు (ఎకరాల్లో..) దిగుబడి
అంచనా (టన్నుల్లో..)
తోతాపురి 99,738 4,98,350
బేనీషా 9137 38,948
నీలం 14545 58,180
మల్లిక 4350 17,400
అల్‌ఫోన్సో 7817 39,085
ఇతర రకాలు 3815 17,167
మొత్తం 1,40,002 6,69,130
మామిడి రకం కిలో ధర
(రూపాయల్లో..)
బేనీషా రూ.28
బేనీషా (కవర్) రూ.32
తోతాపురి కలర్ రూ.13
తోతాపురి రూ.4- రూ.5
హిమాంపసంద్ రూ.110
కాలేపాడ్ రూ.60
మలగూబ రూ.75
మల్లిక రూ.47
నీలం రూ.20 నుంచి 25