Leopard: బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:28 AM
ఎన్వీయూలో మరోసారి చిరుత సంచారంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఎస్వీయూలోని కోళ్ల గూడుపై చిరుత దాడి చేసింది.
తిరుపతి, నవంబర్ 26: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (ఎస్వీయూ) తరచుగా చిరుత సంచరిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో విద్యార్థులు, యూనివర్సిటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రుళ్లు యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత ఎక్కువగా తిరుగుతోంది. దాదాపు కొన్ని నెలలుగా చిరుత తరచూ కనిపిస్తుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గత రాత్రి ఎస్వీయూ ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద చిరుత హల్‌చల్ చేసింది. యూనివర్సిటీలో రాత్రి సంచరించిన చిరుత.. కోళ్ల గూడుపై దాడి చేసింది. చిరుత దాడిలో హడలిపోయిన కోళ్లు అరుపులతో శబ్దాలు చేశాయి. కోళ్ల గూడుపై చిరుత దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
మరోవైపు చిరుత కదలికలతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని వారాలుగా వేదిక్, వెటర్నరీ, ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుతలు తిరుగుతున్న వైనం భయాందోళనకు గురిచేస్తోంది. చిరుతలను పట్టుకునేందుకు దాదాపు ఐదు చోట్ల అటవీశాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బోన్లకు చిక్కుకుండా ఎస్వీయూ పరిసర ప్రాంతాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. ఇక చిరుత సంచారం నేపథ్యంలో క్యాంపస్ రోడ్లపై రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాకపోకలపై అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తరచూ ఇలా చిరుత సంచరిస్తుండటంతో విద్యార్థులు హడలిపోతున్నారు.
ఇవి కూడా చదవండి...
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
వైసీపీకి బిగ్ షాక్.. కొండారెడ్డి కేసులో మరో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News