Share News

Sand: ఇసుక దందా

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:42 AM

‘ఉచితం’ మాటున నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తున్నారు. పగలంతా ఒక ప్రాంతంలో డంప్‌ చేస్తున్నారు. రాత్రిళ్లు రాష్ట్ర సరిహద్దులు దాటించి తమిళనాడుకు తీసుకెళుతున్నారు. ఇలా రాత్రింబవళ్లు ఇసుక దందా సాగిస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు.

Sand: ఇసుక దందా
అరుణా నదిలో ఇటీవల ఇసుక తరలింపు, ఇటీవల చేపట్టిన తవ్వకాలు

సత్యవేడు, ఆంధ్రజ్యోతి: నాగలాపురం మండలం నందనం వద్ద అరుణానదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నదిలో నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అరుణానది నారాయణవనం మండలంలోని కాకముఖ కొండల్లో పుట్టి నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం మండలాల మీదుగా ప్రవహిస్తూ, సురుటుపల్లె వద్ద తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి యాభై కిలోమీటర్ల మేర ప్రయాణించి ఎణ్ణూరు వద్ద బంగాళఖాతంలోకి కలుస్తుంది. అరుణానది పరీవాహక ప్రాంతమంతా పచ్చని పంట పొలాలతో, బంగారు కాంతులు వెదజల్లుతూ మేటలు వేసిన ఇసుక తిన్నెలతో ప్రకృతి శోభను సంతరించుకుని కన్నులపండువగా ఉండేది. ఇదంతా గతం. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అరుణానదికి గర్భశోకం మొదలైంది. అడ్డగోలు అనుమతులతో ఐదేళ్ల పాటు రాత్రి, పగలు సాగిన వైసీపీ నేతల అక్రమ తవ్వకాలతో అరుణానది తన ఆనవాళ్లను కోల్పోయింది. పెద్ద పెద్ద హిటాచీలు, ఎక్స్‌కవేటర్‌లతో నదీగర్భంలో ఇరవై అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వి రోజుకు వందలాది లారీలతో ఇసుకను సరిహద్దు దాటించారు. ఫలితంగా అరుణానది పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఇసుక మాఫియా మళ్లీ జూలు విదిలిస్తోంది. ఉచిత ఇసుక మాటున ట్రాక్టర్ల యజమానుల నుంచి ఇసుకను కొనుగోలు చేస్తూ మామిడి తోటలు, రహస్య ప్రాంతాల్లో భారీగా డంప్‌ చేసుకుని రాత్రికి రాత్రే తమిళనాడు, బెంగళూరుకు తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో యంత్రాలు వాడకూడదన్న నిబంధన ఉంది. ఈ నిబంధన ఉల్లంఘించి పట్టపగలే ఇసుక తవ్వుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో?


అక్రమ రవాణా ఇలా..

ప్రధానంగా అరుణా నది పరీవాహక ప్రాంతాల్లోని నాగలాపురం మండలం నందనం, సుబ్బానాయుడుకండ్రిగ, బయటకొడియంబేడు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తవ్వి గోపాలపురం, జడేరి, ఏఎంపురం మార్గాల్లో తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. పిచ్చాటూరు మండలం అప్పలరాజు కండ్రిగ, పులికుండ్రం, అడవి కొడియంబేడు, ఎస్‌ఎ్‌సబీ పేట, అప్పంబట్టు గ్రామాల నుండి సీతంజేరి, ఊత్తుకోట్టై మీదుగా తమిళనాడుకు తరలిస్తున్నారు. నారాయణవనం మండలంలో తుంబూరు, అరణ్యంకండ్రిగ తదితర గ్రామాల నుంచి విజయపురం మీదుగా తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా పరిశ్రమల నిర్మాణం పేరుతో చెదులుపాక్కం మీదుగా ఇసుకను చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 01:42 AM