Tirumala: శ్రీవారి ఆలయ పైకప్పుకు మరమ్మతులు
ABN , Publish Date - Feb 21 , 2025 | 01:44 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది.

తిరుమల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువైన గర్భాలయం తో పాటు పలు మండపాలు, ఉప ఆలయాలు ఉన్నాయి. వీటి నిర్మాణం జరిగి వందల ఏళ్లు కావ డంతో ప్రస్తుతం మండపాలు, ఉప ఆలయాల పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తోంది.ఈ క్రమంలో గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయిం టింగ్ వేస్తున్నారు. మార్చి31వ తేదీన నాటికి మొత్తం లీకేజీలను నివారించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.
కల్తీ నెయ్యి కేసు నిందితులకు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
తిరుపతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై తిరుపతి 2వ ఏడీఎం కోర్టు న్యాయూర్తి గురువారం తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 10వ తేదీన రిమాండులో వున్న నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారి తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్‌పై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి.నిందితుల తరపున సుప్రీంకోర్టు న్యాయ వాది వాణి వాదనలు వినిపించగా సిట్ తరపున ఏపీపీ జయశేఖర్ వాదించారు. సుదీర్ఘంగా సాగిన వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేశారు.వచ్చే సోమవారం లేదా మంగళ వారం తీర్పు వెలువరించే అవకాశముంది.
తొక్కిసలాటపై నేటి నుంచి రెండవ దశ విచారణ
తిరుపతి(కలెక్టరేట్), ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రెండో దశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా ఈనెల 3వ తేదీ వరకు కమిటీ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి టీటీడీ ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఇన్‌చార్జి సీవీఎస్వో మణికంఠ, రుయా, స్విమ్స్‌వైద్యుల నుంచి వివరాలు సేకరించడమేగాక తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడ పద్మావతి పార్కును పరిశీలించారు. రెండవ దశలో పలువురిని విచారించి వాంగ్మూలం సేకరించనున్నారు. కలెక్టరేట్ వేదికగా ఈ విచారణ సాగనుంది. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులను, గాయపడిన 46మంది బాధితులను, పద్మావతి పార్కు పరిసరాల దుకాణాల వారిని ఇలా మొత్తం 70మందిని విచారించనున్నారు. వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.