Registration: స్లాట్ విధానంలో నేటినుంచి రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:40 AM
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇకపై స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది.

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇకపై స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది. ఈనెల 4వ తేదీనుంచి జిల్లాకేంద్రంలోని చిత్తూరు ఆర్వో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లో ప్రయోగాత్మకంగా అమలుచేసిన ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో బుధవారం నుంచి అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. ఇకపై రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. భూ ములు, ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్లకు తమ పరిధిలోని కార్యాలయాలకు చేరుకుని గంటల తరబడి వేచిచూసేవారు.ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. చిత్తూరు రూరల్, బంగారుపాళ్యం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, కార్వేటినగరం, నగరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం నుంచి నూతన విధానం అమలుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.ఈ ప్రాంతాల్లో రోజుకు 39 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య వారికి నచ్చిన సమయంలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ కేటాయించిన సమయానికి రాకుంటే 20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. దీనిని రీషెడ్యూల్ చేసుకునేందుకు రూ.200 రుసుం చెల్లించాలి.