Elephants: రెండు ఏనుగులకు రేడియో కాలరింగ్ బెల్ట్
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:10 AM
అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కౌండిన్య అభయారణ్యంలో సంచరిస్తున్న రెండు ఏనుగులకు రేడియో కాలరింగ్ బెల్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో పడ్డారు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో ఎంపిక చేసిన ఏనుగులకు దీన్ని ఏర్పాటు చేయాలని భావించినా, సాంకేతిక సమస్యల కారణంగా వీలు కాలేదు.ఈ నేపథ్యంలో వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్ రాకేష్ శుక్రవారం చిత్తూరు ఈస్టు, వెస్టు, పనపాకం ప్రాంతాల్లోని ఎఫ్‌ఆర్వోలు, డీఆర్వోలు, ఎఫ్‌ఎ్‌సఓలు, ఓఫ్‌బీవోలు, 14 మంది ఎలిఫెంట్ ట్రాకర్లతో కలిసి దామలచెరువు బీట్‌లో ఏనుగుల సంచార ప్రాంతాలను పరిశీలించారు. గురువారం పలమనేరు ప్రాంతంలోనూ పరిశీలించారు. పలమనేరు ప్రాంతంలో తిరుగుతున్న ఒంటరి ఏనుగుతో పాటు పులిచెర్ల, దామలచెరువు, కల్లూరు ప్రాంతాల్లో తరచూ సంచరిస్తున్న ఏనుగుల గుంపులో ఒక ఏనుగుకు రేడియో కాలరింగ్ బెల్ట్ అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బెల్ట్ ద్వారా జీయో ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆయా అటవీ పరిసర ప్రాంతాల ఎఫ్‌ఆర్వోలు, డీఆర్వోలు, ఎఫ్‌ఎ్‌సఓల మొబైల్స్‌కు అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా ఏనుగులు ఏ సమయంలో ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయి, ఎక్కడ ప్రమాదం పొంచి ఉందనే విషయాలను పసిగట్టే వీలుంది.దీంతో ఆయా ప్రాంతాల్లోని అటవీ సిబ్బందిని, ఎలిఫెంట్ ట్రాకర్లను అప్రమత్తం చేస్తారు. వారు వెంటనే ప్రాంతానికి చేరుకుని, ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించే ప్రయత్నం చేస్తారు.
కల్లూరుఘాట్‌లో ఒంటరి ఏనుగు హల్‌చల్
కల్లూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో ఉన్న 9 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తూ రెండు రోజుల క్రితం చిన్నగొట్టిగల్లు మండలంలోకి వెళ్లిపోయాయి. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలో ఉన్న 7 ఏనుగుల గుంపులో 4 ఏనుగులు సోమల మండలం వైపు వెళ్లిపోగా రెండు ఏనుగులు సదుం మండలం వైపు వెళ్లిపోయాయి. శుక్రవారం సాయంత్రం పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం నుంచి కల్లూరు ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపైకి చేరుకుంది.
రహదారిపై వెళ్లే వాహనదారులు గమనించి భయాందోళనకు గురయ్యారు.చివరకు ఆ ఏనుగు తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే అర్దగంట అనంతరం తిరిగి హైవేపైకి చేరుకుంది.మళ్లీ వచ్చిన మార్గంలోనే పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది హైవేపైకి చేరుకొని రహదారిపై వెళ్లే ప్రజలను అప్రమత్తం చేశారు.