Share News

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:53 AM

జ్యూస్‌ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ
కేవీబీపురంలో బారులు తీరిన మామిడి లోడు ట్రాకర్లు

సత్యవేడు/కేవీబీపురం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): దిగుబడులు బాగున్నా ధరల్లేక మామిడి రైతులు నష్టాల బాటపడుతున్నారు. ప్రధానంగా తోతాపురి రకం కొనేవారు లేక కుదేలవుతున్నారు. రవాణా ఖర్చులు కూడా లేక కాయలు తోటల్లోనే మాగి నేల రాలుతున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో నారాయణవనం, కేవీబీపురం, బుచ్చినాయుడు కండ్రిగ, సత్యవేడులో జ్యూస్‌ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేసేవారు. మార్కెట్‌లో డిమాండు లేకపోవడంతో ఫ్యాక్టరీలు కొనుగోలుకు విముఖత చూపిస్తున్నాయి. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులయినా వస్తాయా లేదా అని రైతులు ఆందోళనలో ఉన్నారు. నియోజకవర్గంలోని జ్యూస్‌ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. అన్‌లోడింగ్‌కు రెండు, మూడు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కేవీబీపురంలో మూడు నాలుగు రోజులు కూడా నిరీక్షిస్తున్నారు. కొందరు నిరీక్షించలేక రోడ్డుపైనే కాయలు పడేసి వెళ్లిపోతున్నారు.

నియోజకవర్గంలో మామిడి పరిస్థితి

నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2500 హెక్టార్లలో మామిడి పండిస్తారు. ఏటా 8వేల మెట్రిక్‌ టన్నుల నుండి 12 వేల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి అవుతోంది. ఇందులో తోతాపురి సుమారుగా 4వేల నుంచి 5 వేల మెట్రిక్‌ టన్నులున్నాయి ప్రస్తుతం సత్యవేడులోని కాప్రికార్న్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీలో నాణ్యమైన మామిడి మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ రైతుల నుంచి రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు కొనుగోలు చేస్తున్నారు. నారాయణవనం, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీపురం జ్యూస్‌ ఫ్యాక్టరీల వద్ద సమస్య భిన్నంగా ఉంది. దిగుమతి కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది.

Updated Date - Jun 30 , 2025 | 01:53 AM