Gravel: గ్రావెల్ దోపిడీ
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:39 AM
చీకటి పడితే చాలు.. ఆ వెంటనే ఎక్స్‌కవేటర్ల రొద మొదలవుతుంది. ప్రభుత్వ భూమిని చీల్చి గ్రావెల్‌ను తవ్వుతాయి. టిప్పర్లు రయ్‌మంటూ పరుగులు తీస్తాయి. ఇలా పూలతోటమిట్టలో మొదలయ్యే గ్రావెల్ అక్రమ రవాణా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలకు సాగుతోంది.

సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి: సూళ్లూరుపేట డివిజన్‌లో గ్రావెల్ దోపిడీ ఆగడం లేదు. గ్రావెల్ అక్రమ రవాణాతో మాఫియా మళ్లీ చెలరేగిపోతోంది. కొంతకాలం స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా గ్రావెల్‌ను అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. సీజేఎ్‌సఎఫ్, అసైన్డ్ భూముల్లో ఎక్స్‌కవేటర్లతో సాయంతో రాత్రికిరాత్రే గుట్టుచప్పుడు కాకుండా గ్రావెల్‌ను తవ్వి టిప్పర్లలో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా దొరవారిసత్రం మండలం పూలతోటమిట్ట నుంచి సూళ్లూరుపేట, ఇతర ప్రాంతాలకు అక్రమంగా గ్రావెల్ తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం కొంత గ్రావెల్ తవ్వుకుంటే కేసులు నమోదు చేసే అధికారులు ఈ అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేటలో కొత్తగా ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కొన్నిచోట్ల పరిశ్రమలకు పెద్ద మొత్తంలో గ్రావెల్ అవసరమవుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు రాజకీయ నేతల పలుకుబడితో నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. పూలతోటమిట్టలో అసైన్డ్, సీజేఎ్‌సఎఫ్ భూముల్లో చీకటిపడితే చాలు ఎక్స్‌కవేటర్ల సాయంతో గ్రావెల్ తవ్వి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ దొరికే గ్రావెల్‌కు మంచి గిరాకీ ఉండడంతో అక్రమార్కులకు కలిసివచ్చింది. చీకటిపడితే చాలు దొరవారిసత్రం నుంచి సూళ్లూరుపేట వరకు గ్రావెల్ అక్రమ రవాణాచేసే టిప్పర్లు రయ్..రయ్ అంటూ తిరుగుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు.
ఈ గ్రావెల్‌ను మన్నారుపోలూరు, శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో ఉండే వెంచర్లకు తోలి చదును చేస్తున్నా మౌనం వెనుక అర్థం ఆంతర్యం ఏమిటో? ఇప్పటికైనా అధికారులు గ్రావెల్ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.