Share News

Tirupati: తిరుపతి జిల్లా అభివృద్ధికి బంగారు బాటలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:49 AM

కృష్ణపట్నం కేంద్రంగా పరిశ్రమల విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళికలు తిరుపతి జిల్లాకు బంగారు బాటలు పరవనున్నాయి.

Tirupati: తిరుపతి జిల్లా అభివృద్ధికి  బంగారు బాటలు
జోరుగా జరుగుతున్న అభివృద్ధి పనులు

ఈ డిసెంబరుకు పూర్తి కానున్న పనులు

తిరుపతి, ఆంధ్రజ్యోతి: కృష్ణపట్నం కేంద్రంగా పరిశ్రమల విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళికలు తిరుపతి జిల్లాకు బంగారు బాటలు పరవనున్నాయి. వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, సాగరమాల, భారత్‌మాల, కోస్టల్‌ కారిడార్‌.... ఇలా ప్రతిదీ కృష్ణపట్నంతో అనుసంధానం అవుతున్నాయి. కృష్ణపట్నం పోర్టును ఆధారంగా చేసుకునే ఇండస్ట్రియల్‌ నోడ్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 25 కిలోమీటర్ల సమీపంలో వైజాగ్‌-చెన్నై ఎన్‌హెచ్‌-16 నాలుగులేన్ల రహదారి ఉండడం, 15 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణపట్నం రైల్వే స్టేషన్‌ ఉండడం, 90 కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఎయిర్‌పోర్టు ఉండడం, చెన్నై ఎయిర్‌ పోర్టు కూడా 150 కిలోమీటర్ల చేరువలో ఉండడం ఈ ప్రాంత అభివృద్ధికి సోపానాలు అయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మన్ననలు పొందిన శ్రీసిటీ, మేనకూరు సెజ్‌, కొత్తగా పురుడు పోసుకుంటున్న క్రిస్‌సిటీలను కలుపుతూ అద్భుతమైన రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి తిరుపతి జిల్లా రూపురేఖలను మార్చబోతున్నాయి. రూ. 2872 కోట్లతో పనులు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రోడ్లు, మౌలిక సదుపాయాల పనులు పూర్తయితే కృష్ణపట్నం నోడ్‌ పేరిట ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు సైతం వేగవంతం అవుతుంది.

భారత్‌ మాల ప్యాకేజీ-2 పార్ట్‌- 1:

ఈ ప్యాకేజిలో భాగంగా ఎన్‌హెచ్‌ 16 చిల్లకూరు క్రాస్‌ రోడ్డు నుంచీ తూర్పు కనుపూరు వరకూ 24.92 కిలోమీటర్ల ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దానితో పాటు ఫ్లైఓవర్‌, అప్రోచ్‌ రోడ్డుల పనులు కూడా చేపట్టారు.


భారత్‌ మాల ప్యాకేజీ-2 పార్ట్‌ -2:

దీని కింద తూర్పు కనుపూరు నుంచీ కృష్ణపట్నం పోర్ట్‌ దక్షిణ గేట్‌ వరకూ 11.24 కిలోమీటర్ల మేరకు సిక్స్‌ లేన్‌ రోడ్డు పనులు సాగుతున్నాయి. రూ. 864.24 కోట్ల అంచనాతో ఈ పనులను మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ 2023 డిసెంబరు 17న చేపట్టింది. ఈ ఏడాది డిసెంబరుకల్లా పనులు పూర్తి కానున్నాయి.

భారత్‌మాల ప్యాకేజీ 3:

ఈ ప్యాకేజీలో గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు ప్రాజెక్టు పురోగతిలో వుంది. తమ్మినపట్నం వద్ద కృష్ణపట్నం పోర్టు నుంచీ (కండలేరు క్రీక్‌ నార్త్‌ అండ్‌ సౌత్‌ ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌) మొల్లూరు వరకూ కనెక్ట్‌ చేయడానికి ఆరు వరుసల రోడ్డును 15.95 కిలోమీటర్ల మేరకు పొడిగించే పనులు జరుగుతున్నాయి. రూ. 609.43 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను ఏఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థ 2023 సెప్టెంబరు 25న ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పనులు పూర్తయ్యే అవకాశముంది.

సాగరమాల ప్యాకేజీ 4 :

నాయుడుపేట నుంచీ తూర్పు కనుపూరు వరకు 34.88 కిలోమీటర్ల పొడవైన సిక్స్‌ లేన్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆప్కో ఇన్‌ఫ్రా టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. 1398.84 కోట్ల అంచనాతో 2023 డిసెంబరు 20న పనులు మొదలు పెట్టింది. ఈ ఏడాది అక్టోబరుకల్లా పనులు పూర్తి కానున్నాయి.

క్రిస్‌ సిటీకి అనుసంధానం

క్రిస్‌ సిటీకి ఎక్స్‌టర్నల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్టు కింద పలు పనులు జరుగుతున్నాయి. బల్లవోలు దగ్గర కాకువారిపాలెం నుంచీ వరగలి వరకూ ఇపుడున్న లింక్‌ రోడ్డును 17 కిలోమీటర్ల మేరకు విస్తరిస్తున్నారు. ఈ లింక్‌ రోడ్డు ఫోర్‌ లేన్‌ రోడ్డును కలుపుతుంది.

అలాగే భారత్‌మాల కింద ఎన్‌హెచ్‌లో (ప్యాకేజీ 2, పార్ట్‌ 2) నాయుడుపేటను, కృష్ణపట్నం పోర్టును కలిపే మేజర్‌ బ్రిడ్జి -1 వద్ద చివరి మైలు కనెక్ట్‌ చేసే పని జరుగుతోంది. అదే ఎన్‌హెచ్‌లో మేజర్‌ బ్రిడ్జి-2 వద్ద చివరి మైలును కనెక్ట్‌ చేసే పని జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ ఏడాది సెప్టెంబరు నుంచీ డిసెంబరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పనుల పురోగతిని పూర్తిస్థాయిలో సమీక్షించింది. త్వరగా పనులు పూర్తి చేయాలంటూ సంబంధిత కాంట్రాక్టు సంస్థలను, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వెంట జిల్లా అధికారులు పడుతున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:49 AM