Andhra Jyothi: ముగిసిన ‘ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్’ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:24 AM
తిరుపతినగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ఆదివారం విజయవంతంగా ముగిసింది.

తిరుపతి(విద్య/రూరల్), ఏప్రిల్20 (ఆంధ్రజ్యోతి): తిరుపతినగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఇంటర్మీడియట్ లేదా ప్రీడిగ్రీ తర్వాత ఏ కోర్సు చేయాలనే సందిగ్థంలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈఎక్స్‌పోను సందర్శించి.. ఆయా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, కోర్సుల వ్యవధి, వాటి ఫీజులు వంటి వివరాలను తెలుసుకున్నారు. విదేశీవిద్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రముఖ విద్యాసంస్థల స్టాళ్ల సహాయకులతో నేరుగా మాట్లాడి సవివరంగా తెలుసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రతిష్ఠాత్మక 30 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కన్సల్టెన్సీ ఏజన్సీలు హాజరవగా..నగరంలోని పలు విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్న వందలాదిమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు సందర్శించారు.
అపూర్వ స్పందన
జిల్లాతోపాటు నగరంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల రాకతో ఎక్స్‌పోకు అపూర్వ స్పందన లభించింది. ఏకకాలంలో దక్షిణ భారతదేశంలోని ఇన్ని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చి సమగ్ర విద్యా సమాచారాన్ని అందించిన ఆంధ్రజ్యోతి-ఐఆర్‌ఎంఎస్ ఎక్స్‌పోకు విశేష ఆదరణ లభించింది. ఎక్స్‌పోను సందర్శించే వారికోసం ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ (ఐఆర్‌ఎంఎ్‌స)ఫౌండర్ అండ్ సీఈవో రాజ.సి, టర్న్‌కీ ఈవెంట్స్ ఫౌండర్ అండ్ సీఈవో రాధాక్రిష్ణన్ టీకే నేతృత్వంలో అన్ని ఏర్పాట్లను చేశారు.
ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ (ఐఆర్‌ఎంఎ్‌స)ఫౌండర్ అండ్ సీఈవో రాజ.సి, టర్న్‌కీ ఈవెంట్స్ ఫౌండర్ అండ్ సీఈవో రాధాక్రిష్ణన్ టీకేకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం తరపున తిరుపతి బ్రాంచ్ మేనేజర్ సురే్‌షరెడ్డి జ్ఞాపికలు అందజేసి అభినందించారు.