Tirumala: ‘కొండ’ంత భక్తజనం
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:11 AM
వరుసగా మూడు రోజుల సెలవులు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం.. ఈ క్రమంలో తిరుమలలో నెలకొన్న రద్దీ ఆదివారమూ కొనసాగింది.

తిరుమల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వరుసగా మూడు రోజుల సెలవులు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం.. ఈ క్రమంలో తిరుమలలో నెలకొన్న రద్దీ ఆదివారమూ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకున్న సమాచారం మేరకు సర్వదర్శన భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాగా, ఆదివారం రాత్రి సర్వదర్శన క్యూలైన్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. టీబీసీ, ఏటీసీ వద్ద క్యూలైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను చూశారు. మొబైల్ ఫుడ్ వెహికల్స్‌ను పరిశీలించి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలను అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులకు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో దర్శనాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే క్యూలైన్‌లోకి ప్రవేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.