Chintamaneni Prabhakar : అంబటి, జగన్‌పై సెక్షన్ 306 పెట్టిస్తా
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:28 AM
‘కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను.

కోడెల ఆత్మహత్యకు వారే కారణం: చింతమనేని
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. ఆయన చావుకు కారణమైన వారిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయించేవరకు ఊరుకోను’ అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ‘కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించింది అంబటి రాంబాబు, జగన్‌లే. వారిపై సెక్షన్ 306కింద కేసు పెట్టాల్సిందే. కోడెల ఫర్నీచర్ దొంగతనం చేశారని అక్రమ కేసు బనాయించారు. ఇప్పుడు ఎంత విలువైన ఫర్నీచర్ కావాలో చెబితే ఇస్తా. కోడెల ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా?’ అని ప్రశ్నించారు. ‘అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌ను బూతులు తిట్టానని అంబటి రాంబాబు తెగ బాధపడుతున్నారు. అసలు జరిగింది ఏమిటో ఆయన తెలుసుకోవాలి. నా కారుకు, తన కారు అడ్డం పెట్టడంతో ప్రశ్నించా. అది తప్పా? అబ్బయ్య తిడితే తలవంచుకుని వెళ్లాలా? అబ్బయ్య చౌదరి పేరుకే సాఫ్ట్‌వేర్. మనిషి మాత్రం హార్డ్‌వేర్. అలాంటి క్రిమినల్‌కి అంబటి వత్తాసు ఏమిటి? అంబటి పగటి పూట మాత్రమే రాంబాబు... రాత్రిపూట కాంబాబు’ అని చింతమనేని విమర్శించారు.