Chevireddy Bhaskar Reddy: తుడాలో అక్రమాలపై విజిలెన్స్ తుది నోటీసుకూ స్పందించని చెవిరెడ్డి
ABN , Publish Date - Jun 24 , 2025 | 07:24 AM
గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా)లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జారీ చేసిన తుది నోటీసుకు కూడా తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పందించలేదు. ఆ నోటీసుకు సోమవారంతో గడువు ముగిసింది.

మూడుసార్లు పిలిచినా హాజరుకాని మాజీ ఎమ్మెల్యే
తిరుపతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా)లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జారీ చేసిన తుది నోటీసుకు కూడా తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పందించలేదు. ఆ నోటీసుకు సోమవారంతో గడువు ముగిసింది. ఆయన అధికారుల ఎదుట హాజరుకాకపోవడంతో.. తాము సేకరించిన సమాచారంతోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు వారు సిద్ధమవుతున్నారు. జగన్ హయాంలో తుడా చైర్మన్‌గా నాలుగేళ్ల పాటు నాటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చివరి ఏడాది ఆయన తనయుడు మోహిత్‌రెడ్డి పని చేశారు.
2019-24 నడుమ ఈ సంస్థ నిధులను భారీ ఎత్తున ఇతర అవసరాలకు మళ్లించి దుర్వినియోగం చేశారని టీడీపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన రాష్ట్రప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తిరుపతి విజిలెన్స్ ప్రాంతీయ అధికారి కరీముల్లా షరీష్ నేతృత్వంలో ఏడాదిగా విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా తుది నోటీసు 16వ తేదీన జారీ చేయగా.. ఆయన 17వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రి సిట్ అధికారులు బెంగళూరు వెళ్లి.. లిక్కర్ స్కాం కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 18న విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నారు.