Andhra politics: బంగారుపాళ్యంలో దండుపాళ్యం
ABN , Publish Date - Jul 10 , 2025 | 02:51 AM
మళ్లీ అదే అరాచకం నిండు ప్రాణాలను తన పర్యటనలు బలి తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని సూచనలు చేస్తున్నా...

రైతుల పరామర్శ పేరిట అదే అరాచకం
దండయాత్రలా మామిడి యార్డుకు జగన్
‘ఎంపిక’చేసిన రైతులకు అరగంటే పరామర్శ
ఎక్కడా రూల్స్‌ను పాటించని వైసీపీ బ్యాచ్
యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి రచ్చ రచ్చ
పోలీసులను నెట్టేస్తూ..కవ్విస్తూ నానా బీభత్సం
‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి
హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు
బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లే యత్నం
అడ్డుపడిన చిత్తూరు ఎస్పీపైకి వాహనం..
బంగారుపాళ్యం స్టేషన్‌లో 3 కేసులు నమోదు
నిరసన పేరుతో అరాచకం! పరామర్శ పేరుతో దౌర్జన్యం! నిబంధనలంటే లెక్కలేదు. ఆంక్షలకు విలువలేదు. పోలీసు అధికారులకే ‘రప్పా రప్పా’ బెదిరింపులు! ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి! అనుమతించిన దారిలోకాకుండా... ఊరిలోంచి వెళ్లే దూకుడు ప్రయత్నాలు! ప్రశాంతమైన బంగారుపాళ్యంలో ‘దండుపాళ్యం’ బ్యాచ్ తరహా దౌర్జన్యకాండ! ఇదీ... ‘మామిడి రైతులకు పరామర్శ’ పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దండయాత్ర! ఇంతాచేస్తే... ఆయనవల్ల రైతులకు మేలు జరగలేదు సరికదా, కీడే జరిగింది! మండీలో అమ్ముకుందామని ఓ రైతు తెచ్చుకున్న తోతాపురి కాయలను వైసీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డుపై పడేసి, ట్రాక్టర్లతో తొక్కించారు. అటు... ముందస్తు వ్యూహం ప్రకారం స్థానిక వైసీపీ నేత తోటలోని కాయలను రోడ్డుపై పడేసి ‘నిరసన’ తెలిపారు. తోతాపురి మామిడిపై జగన్ పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు... జగన్ పర్యటన కారణంగా బుధవారం మామిడి మండీ మూతపడింది. సీజన్ చివర్లో ఒకరోజు ఇలా వృథా కావడంతో తమకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలపట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ది స్వార్థపూరిత రాజకీయ యాత్రే తప్ప... తమకు మేలు చేసే యాత్ర కాదని మండిపడ్డారు!
బంగారుపాళ్యం, చిత్తూరు (అర్బన్), జూలై 9 (ఆంధ్రజ్యోతి): మళ్లీ అదే అరాచకం! నిండు ప్రాణాలను తన పర్యటనలు బలి తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని సూచనలు చేస్తున్నా...ఏ మార్పూలేని తన నైజాన్ని వైసీపీ అధినేత జగన్ మరోసారి బయటపెట్టుకున్నారు. మామిడి రైతులకు పరామర్శ పేరిట బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంపై దండయాత్ర సాగించారు. సీఎంగా పనిచేసినా, జడ్‌ప్లస్ భద్రతలో ఉన్నా.. హుందాతనమే లేకుండా, నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించారు. పోలీసులకు ఇచ్చిన రూట్‌మ్యా్‌పకు భిన్నంగా బంగారుపాళ్యంలోకి వెళ్లేందుకు.. వాహనాన్ని అటు తిప్పి.. ఇటు తిప్పి.. నడిరోడ్డుపై డ్రామాలాడారు. నిబంధనలు గుర్తుచేస్తూ... ముందుకు వెళ్లకుండా అడ్డు నిలబడిన ఎస్పీపైకి వాహనాన్ని నడిపించేందుకూ వెనుదీయలేదు. మరి నాయకుడు అడ్డదారి పడితే, కార్యకర్తలు మెయిల్ రోడ్డులో వెళతారా? బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వద్ద వైసీపీ శ్రేణులు రచ్చ రచ్చ చేశాయి. భద్రతా విధుల్లోని పోలీసులను కవ్విస్తూ వీరంగం సృష్టించాయి. జగన్ మార్కెట్ యార్డుకు రాకముందే యార్డులోకి వైసీపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించాయి. అమ్ముకోడానికి ఓ రైతు రెండు ట్రాక్టర్లలో తెచ్చుకున్న మామిడికాయలను రోడ్డుపై పారబోశారు. యార్డులోని మామిడి రైతులను, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాయి. విధి నిర్వహణలోని ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడిచేశాయి. ఇంతాచేసి.. మామిడికాయల మండీలో అరగంటకు మించి జగన్ గడపలేదు.
హెలిప్యాడ్ వద్ద హంగామా..
జగన్ పర్యటనలో హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్‌యార్డులో 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. వైసీపీ శ్రేణులు వాటిని లెక్క చేయలేదు. హెలిప్యాడ్‌ను 500మంది చుట్టుముట్టారు. బయట మూడు వేలమంది మోహరించారు. అక్కడ దీంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. జగన్ కాన్వాయ్‌తో పాటు నడుస్తున్న చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి, చిత్తూరు డీసీసీబీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డమ్మ, ఓ డీఎస్పీ సైతం తోపులాట కారణంగా కింద పడిపోయారు.
రూట్ మార్చేందుకు జగన్ ప్రయత్నం: జగన్ పర్యటన రూట్‌మ్యా్‌పను ముందస్తుగా వైసీపీ విడుదల చేసింది. దాని ప్రకారం బంగారుపాళ్యం సమీపంలోని కొత్తపల్లె వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుంచి జగన్ కాన్వాయ్.. హైవే మీదుగా నలగాంపల్లె ఫ్లైఓవర్ నుంచి మార్కెట్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ జగన్ ముందుగా అనుకున్న రూట్ ప్రకారం కాకుండా బంగారుపాళ్యం పట్టణంలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. హైవే మీదు అనుకున్నంత జనాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చిత్తూరు ఎస్పీ మణికంఠ అభ్యంతరం తెలిపారు. హెలిప్యాడ్‌కు 200 మీటర్ల దూరంలోని చరణ్ దాబా వద్ద జగన్‌కీ, ఎస్పీకీ మధ్యలో దీనిపై కాసేపు వాదన జరిగింది. జగన్ కారుకు ఎదురుగా ఎస్పీ, మరో ఇద్దరు పోలీసు అధికారులతో అడ్డంగా నిలబడిపోయారు. ముందుగా ప్రకటించిన రూట్‌లోనే వెళ్లాలని కోరారు. కానీ జగన్ ఆగ్రహంతో ఎస్పీ మాట వినకుండా ‘ముందుకు పోనివ్వు’ అని తన కారు డ్రైవర్‌ను ఆదేశించినట్టు అక్కడున్నవారు చెప్పారు. దీంతో ఎస్పీ మరో 150 మీటర్ల దూరం వెళ్లి ఇంకొంతమంది పోలీసులను, వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టేశారు. ఇక చేసేదేమీలేక జగన్ కాన్వాయ్ ముందుగా అనుకున్న హైవే రూట్ మీదుగానే మార్కెట్ యార్డుకు చేరుకోవాల్సి వచ్చింది.
రోడ్డు షో 2.30 గంటలు.. రైతులతో అర గంట హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డుకు కేవలం 4.2 కిలోమీటర్ల దూరం ఉంది. జగన్ హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11.20 గంటలకు చేరుకున్నా, యార్డుకు చేరుకునే సరికి మధ్యాహ్నం 1.40 అయ్యింది. ఈ కాస్త ప్రయాణానికి ఆయనకు 2.20 గంటలు పట్టింది. కావాలనే జగన్ ఆలస్యం అయ్యేలా చేశారని అంటున్నారు. ఇందులో అరగంట పాటు రూట్ మార్చాలనే వాదనతో గడిపారు. జనాలు లేని హైవే మీద రోడ్ షో చేశారు. ముందుగా ప్లాన్ చేసి రోడ్డు మీద పడేసిన మామిడి కాయల్ని చూసుకుంటూ, నిదానంగా సాగారు. తీరా యార్డులో మాత్రం అరగంట సమయం మాత్రమే ఉన్నారు. అక్కడ కూడా వైసీపీ సానుభూతిపరులు నలుగురిని ముందుగా సిద్ధంగా ఉంచి, వారితో మాట్లాడించారు. ఎప్పుడూ రైతులతో నిండి ఉండే యార్డు వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఇక్కడ కూడా వైసీపీ బ్యాచ్ నానా బీభత్సం సృష్టించింది. బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు ప్రధాన గేటును పోలీసులు మూసేసినా లెక్క చేయలేదు. పోలీసులను, గేట్లను తోసేసి లోపలికి వెళ్లిపోయారు. దాదాపు ఐదు వేల మంది యార్డులోకి జొరబడి గందరగోళం సృష్టించారు.
మూడు కేసుల నమోదు...
జగన్ పర్యటనలో చోటుచేసుకున్న ఉల్లంఘనలపై బంగారుపాళ్యం పోలీ్‌సస్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. హెలిప్యాడ్ వద్ద 30 మందికి, యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిచ్చినా.. నిబంధనల్ని పాటించలేదంటూ ఓ కేసు పెట్టారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ కుమార్‌రాజా పేర్లను ప్రస్తుతానికి చేర్చారు. జగన్ వచ్చేటప్పుడు ఆ మార్గంలో రోడ్డు మీద మామిడి కాయల్ని పారబోసిన ఘటనలో అక్బర్, ఉదయ్‌కుమార్ అనే ఇద్దరిపై రెండో కేసును నమోదు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ చిత్తూరు స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడికి సంబంధించి మూడో కేసు నమోదైంది. శివకుమార్‌పై దాడి చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ప్రకాశ్ ఆచారి ఈ ఫొటోల్లో ప్రధానంగా కనిపించారు. మిగిలిన వారిని కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.
ఏడాది కష్టం నేలపాల్జేశారు
‘‘నేను ఏడాదంతా కష్టపడి సాగుచేసిన మామిడికాయలను జగన్ వస్తున్నారని చెప్పి రోడ్డుపై పారపోశారు. ఇన్ని రోజులూ పర్మిట్లు లేక కాయలు కోయలేదు. ధరలు ఉండటం వల్ల రెండు ట్రాక్టర్ల కాయల్ని మార్కెట్ యార్డుకు తెచ్చా. వాటిని వైసీపీ నేతలు రోడ్డుపై పోసి నా ట్రాక్టర్‌తోనే తొక్కించారు. ఏడాది కష్టం పోయింది. ప్రభుత్వం ఇస్తానన్న సబ్సిడీ కూడా పోయింది.’’
- దూర్వాసులు నాయుడు,
ఈసినేరిపల్లె