Share News

CM Chandrababu Naidu: ఆ ఎమ్మెల్యేలను గాడిలో పెడతారా

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:00 AM

గత ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం, గనులు విపరీతంగా దోపిడీకి, అడ్డగోలు అక్రమాలకు గురయ్యాయి. దీంతో వీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను, వాటి జోలికి పోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలను అధినేత చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు.

CM Chandrababu Naidu: ఆ ఎమ్మెల్యేలను గాడిలో పెడతారా

  • ఇసుక, మద్యం, గనులు, సెటిల్మెంట్లపై కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు

  • ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న బాబు

  • మహానాడులోనూ గట్టి వార్నింగ్‌

  • అయినా కొందరి తీరు మారని వైనం

  • పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పులు

  • వారిని ‘సరిచేయ’డానికి సిద్ధమైన అధిష్ఠానం

  • నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

  • 1-1 చర్చించి.. వారి తప్పులు చెప్పే చాన్స్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం, గనులు విపరీతంగా దోపిడీకి, అడ్డగోలు అక్రమాలకు గురయ్యాయి. దీంతో వీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను, వాటి జోలికి పోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలను అధినేత చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు. మహానాడు వేదికగా బహిరంగంగానే వార్నింగ్‌ కూడా ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు చాలావరకు దారికివచ్చినా, కొందరు మాత్రం కట్టు తప్పుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. దీంతో ఇలాంటివారిని గుర్తించి ‘సరిచేయడానికి’ ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు.


దారి తప్పిన అలాంటి ఎమ్మెల్యేలను, నేతలను గాడిలో పెట్టేందుకు, కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సమావేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు ‘క్లాస్‌’ తీసుకోనున్నారు. అంతేకాదు.. తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నవారిని ప్రత్యేకంగా పిలిచి 1-1 చర్చించనున్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలకు చేరువ కావాలని హెచ్చరించడంతోపాటు గట్టి వార్నింగే ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏడాది పాలన పూర్తిచేసుకున్న దరిమిలా.. ప్రజల్లో సానుకూల దృక్ఫథం పెంచే విధానాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

2 నుంచి ప్రజల్లోకి

రాష్ట్రంలో కూటమి సర్కారు ఏడాది పాలనా విజయాలు.. భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జూలై 2వ తేదీ నుంచి చేపడుతున్న ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’పై పార్టీ శ్రేణులను సీఎం చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొననున్నారు. ‘ఇంటి ఇంటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమంతో పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లాలని అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాది పాలనలో విజయాలతోపాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. అదేవిధంగా ప్రతిపక్షం వైసీపీ నేతల అరాచకాలను కూడా ప్రజలకు వివరించనున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 04:00 AM