Share News

CM Chandrababu: మీకు జీవితాంతం రుణపడి ఉంటా

ABN , Publish Date - Jan 21 , 2025 | 03:20 AM

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుజాతిలోనే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu:  మీకు జీవితాంతం రుణపడి ఉంటా

  • మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా

  • జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం

  • 2047 నాటికి నం.1గా తెలుగుజాతి

  • ఇంతమంది యూర్‌పలో ఉన్నారనుకోలేదు

  • జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తెలుసుకున్నా

  • నా కోసం 53 రోజులూ ప్రదర్శనలు చేశారు

  • ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చు చేసి కూటమి

  • అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు: బాబు

పెట్టుబడుల వేట, ‘బ్రాండ్‌ ఏపీ’ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. దావోస్‌కంటే ముందే... స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. స్విస్‌లోని భారత రాయబారితోనూ చర్చలు జరిపారు. జ్యూరిక్‌లో వరుస సమావేశాలు నిర్వహించారు.

‘‘ఇన్ని దేశాల్లో ఇంతమంది తెలుగువారు ఉన్నారని నేను ఊహించలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడో ఉండి నా కోసం ప్రదర్శనలు నిర్వహించారు. ఇన్నిదేశాల్లో తెలుగువారున్నారా అని అప్పట్లో నేను ఆశ్చర్యపోయాను. ఈ ప్రదర్శనలు ఒకటి రెండు రోజులు కాదు.. నేను జైలులో ఉన్న 53 రోజులూ కొనసాగించారు. ఇందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆ తర్వాత జరిగిన ఎన్నికలప్పుడూ అంతే.. ప్రపంచం నలుమూలల నుంచి మీరంతా వచ్చి నెలల తరబడి ఏపీలో ఉన్నారు. మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బు ఖర్చుపెట్టి కూటమి అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇంత స్ఫూర్తిదాయకమైన తెలుగు జాతిలో పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మళ్లీ తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నా’’

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుజాతిలోనే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావో్‌సకు వెళ్తూ మధ్యలో, జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దాదాపు 12 దేశాల నుంచి మీరంతా వచ్చారు. ఒకప్పుడు విమానాశ్రయానికి వస్తే ఎవరూ కనబడేవారుకాదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరిగిపోయింది. యూర్‌పలో తెలుగువారు ఎక్కువమంది ఉన్నారు. ఇక్కడ బోలెడన్ని అవకాశాలూ ఉన్నాయి.’’ అని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

Untitled-3 copy.jpg


సంస్కరణలు ప్రారంభించింది నేనే...

‘‘పౌరులను తయారుచేసే బాధ్యత తీసుకున్న నాయకులు ప్రతి దేశంలోను కనిపిస్తారు. సింగపూర్‌ ఫిషర్‌మెన్‌ విలేజ్‌ను నాటి పాలకుడు లిక్‌వాన్యూ.. మంచి నివాస దేశంగా మలిచారు. 1995లో ముఖ్యమంత్రి అవుతూనే నేనూ ఇలాగే ఆలోచించాను. 1991లో ఐటీ విప్లవం వచ్చింది. దానిని ఆధారం చేసుకుని రెండోదశ సంస్కరణలు ప్రారంభించాను. ఫలితంగా ఈరోజు హైదరాబాద్‌ దేశంలోనే నంబరవన్‌ తలసరి ఆదాయం కలిగి ఉంది.’’

‘డబుల్‌ ఇన్‌కమ్‌.. నో కిడ్స్‌...’

‘‘డబ్బులు వచ్చాయి. ఐటీ విప్లవంతో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. డబుల్‌ ఇన్‌కమ్‌, నో కిడ్స్‌. ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో అన్ని దేశాల్లో జనాభాసమస్య వచ్చింది. భారత్‌ నుంచి మనుషులను పంపాలని జపాన్‌ అడుగుతోంది. మనుషులు లేకపోతే ఎవరు పనిచేస్తారు? అందువల్లే ఈ సమస్యపై నేనిప్పుడు దృష్టి పెట్టా. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చౌక. దానికోసం మన విద్యార్థులు అక్కడకు పోయి..ఆ యుద్ధంలో చిక్కుకున్నారు. వారి క్షేమం గురించి నాటి జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు నేను ఇచ్చిన పిలుపునకు యూర్‌పలోని తెలుగువారంతా స్పందించారు. మన విద్యార్థులను క్షేమంగా ఏపీకి రప్పించడానికి సహకరించారు’’

ఫైల్‌ పట్టుకుని అమెరికాలో తిరిగాను..

‘‘ఆ రోజు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలను ప్రారంభించకపోతే ఏమయ్యేది? నేను ఆరోజు మీ భవిష్యత్తు చూశాను. అందువల్లే ఫైలు పట్టుకుని అమెరికా లో తిరిగాను. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ రాజకీయనేతలను కలవరు. చివరకు ఆయనను కలిసి, 45 నిమిషాలు మాట్లాడాను. మైక్రోసాఫ్ట్‌ సెంటరును హైదరాబాద్‌లో పెట్టేందుకు ఒప్పించాను. మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌కు రావడం వల్లే తెలుగుబిడ్డ సత్యనాదెళ్ల సీఈవో అయ్యారు’’


వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ హబ్‌గా ఏపీ

‘‘2004లో టీడీపీ తిరిగి గెలిచిఉంటే, తెలుగుజాతి ఇప్పుడు ఎక్కడో ఉండేది. కానీ నా తర్వాతి పాలకులు నేను నిర్మించిన సైబరాబాద్‌ను కూల్చలేదు. కానీ, 2019లో వైసీపీ ప్రభుత్వం... ప్రజా వేదికను కూల్చేసింది. వాటన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఏపీని వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ హబ్‌గా చేయాలన్నదే నా కోరిక. మోదీ వికసిత భారత్‌ పిలుపునిస్తే.. స్వర్ణాంరఽధ లక్ష్యంగా విజన్‌-2047నుతయారు చేశాను. ఈ విజన్‌ సాకారానికి మీరూ సహకరించండి ’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Updated Date - Jan 21 , 2025 | 03:20 AM