Chandrababu Requests: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగమివ్వాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:38 AM
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్రానికి అదనపు నిధుల సమర్పణ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, పోలవరం ప్రాజెక్టుకు సాయం కావాలని అభ్యర్థించారు. ఆయన రాష్ట్ర ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం కోరారు

ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్నిపూడ్చండి: చంద్రబాబు
అధిక నిధులకు సిఫారసు చేయండి
అమరావతికి రూ.47,000 కోట్లు కావాలి
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లను కలుపుతూ ప్రణాళికలు రూపొందించాలి
అప్పుడు వికసిత్ భారత్‌లో దక్షిణాదీ కీలకం
‘స్థానిక సంస్థల’ వెయిటేజీలు మార్చండి
రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయాం
తెలంగాణ ఆదాయంలో 75% ఆ నగరం నుంచే
గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ
10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్-2047
పోలవరం-బనకచర్లకు సాయం చేయండి
16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం
పనగారియా బృందానికి సవివర ప్రజంటేషన్
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలదే కీలక పాత్ర గనుక కేంద్ర పన్నుల్లో వాటి వాటా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో 41 శాతంగా ఉన్న రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే జనాభా, విస్తీర్ణం, అడవుల విస్తీర్ణం, తలసరి ఆదాయం తదితర అంశాల ఆధారంగా నిర్ణయించే క్షితిజ సమాంతర పన్నుల పంపకం(హారిజాంటల్ డివల్యూషన్)లో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిపోతోందని, 10వ ఆర్థిక సంఘం సమయంలో వాటికి 24.3 శాతం దక్కేదని.. 15వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి 15.8 శాతానికి తగ్గిందని చెప్పారు. ఆంధ్ర వాటా దేశ జీడీపీ, జాతీయ జనాభా వాటా కంటే తక్కువగా ఉందని.. ఇది ఆర్థికంగా తమకు నష్టం కలిగిస్తోంది కనుక ఈ విభాగంలో ఏపీకి న్యాయం చేయాలని కోరారు. చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం నాలుగు రోజుల పర్యటన కోసం బుధవారం రాష్ట్రానికి వచ్చింది.
మొదటి రోజు సచివాలయానికి వచ్చిన ఈ బృందానికి సీఎం స్వయంగా మొదటి బ్లాక్ వద్ద స్వాగతం పలికారు. తర్వాత అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం మొదలైనవాటిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చూపించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014 తర్వాత వృద్ధిరేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 2019-24 నడుమ నాటి ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం, గత 10 నెలల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్-2047, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ పాలసీలను ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అదనపు సాయం అందించాలని ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో రాష్ట్రం రెవెన్యూ లోటు కోరల్లో చిక్కుకుందన్నారు. 2025-26లో రెవెన్యూ లోటు రూ.1,28,146 కోట్లు ఉంటుందనేది అంచనాగా పేర్కొన్నారు. 2026-27లో రూ.1,29,725 కోట్లు, 2027-28లో రూ.1,33,345 కోట్లు, 2028-29లో రూ.1,37,005 కోట్లు, 2029-30లో రూ.1,42,073 కోట్ల లోటు ఉంటుందన్నారు. ఇంత భారీ లోటును తట్టుకునే సామర్థ్యం రాష్ట్రానికి లేదని, ఈ అగాధాన్ని పూడ్చేలా అధిక నిధులు సిఫారసు చేయాలని అభ్యర్థించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. ఇంకా ఏం కోరారంటే..
స్థానిక సంస్థలకు ఊతం..
గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు.. 20 శాతం వ్యవసాయం, అనుబంధ రంగాలకు.. 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు రూ.69,897 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.7,381 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రూ.62,516 కోట్లు అవసరం. పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారుల నిర్మాణం, పట్టణ రవాణా, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థల కోసం రూ.19,871 కోట్ల గ్రాంట్లు అవసరం. 2026-31 మధ్య ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.16,181 కోట్లు కావాలి. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరం కాగా.. ప్రపంచబ్యాంకు, హడ్కో, ఏఐఐబీ, కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.31,000 కోట్ల రుణాలు సమకూరాయి. ఇంకా రూ.47,000 కోట్లు అవసరం.
ఆంధ్రప్రదేశ్ అవసరాలివీ..
పోలవరం-బనకచర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, 5 పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖ, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం), ఐఐటీ-తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, బౌద్ధపర్యాటకం, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖలో ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవల్‌పమెంట్, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్, 100 శాతం అక్షరాస్యత, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, అంతర్గత జలరవాణా, రహదారులు.. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి రీజినల్ గ్రోత్ సెంటర్లు.. తదితర ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు ఇచ్చేలా ఆర్థిక సంఘం సిఫారసులు చేయాలి.
రాష్ట్ర అనుకూలతలు ఇవే..
అతి పెద్ద తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్.. తూర్పు దేశాలకు గేట్‌వే. 3 పారిశ్రామిక కారిడార్లు.. 6 పోర్టులు, 7 విమానాశ్రయాలు ఉన్నాయి. దేశ ఎగుమతుల్లో 5.8% రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. బ్లూ ఎకానమీ, ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్, ఐవోటీ, బ్లాక్‌చెయిన్ వంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్నాం. ఆంధ్రను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ఉన్నాం. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 2030 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి మా లక్ష్యం. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
నిలబడేందుకు సాయం చేయండి
అప్పుల కోసం గత ప్రభుత్వం తహశీల్దార్ కార్యాలయాలను కూడా తనఖా పెట్టింది. 25 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే రాబడినీ తాకట్టు పెట్టింది. ఇన్ని కష్టాల నడుమ రాష్ట్రం నిలబడేందుకు, ముందుకు వెళ్లేందుకు ఆర్థిక సంఘం సాయం చేస్తే దేశ నిర్మాణంలో ముఖ్యమైన రాష్ట్రంగా నిలుస్తాం. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ఉద్యోగ కల్పనకు అవసరమైన పెట్టుబడులు సాధించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. జాబ్ ఫస్ట్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపొందించుకున్నాం. 10 సూత్రాలతో ప్రణాళిక అమలు చేస్తున్నాం.
ఏడాదికి 15% వృద్ధిరేటు
ఏడాదికి 15% వృద్ధిరేటు సాధించి 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్ర అవతరించేలా కృషి చేస్తున్నాం. తలసరి ఆదాయం 42,000 డాలర్లు, ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు, సగటు జీవిత కాలం 85 ఏళ్లు, అక్షరాస్యత 100 శాతం, నిరుద్యోగ రేటు 2 శాతానికి మించకుండా అభివృద్ధి చెందాలన్న లక్ష్యాలతో పనిచేస్తున్నాం.
ప్రస్తుత జీఎస్‌డీపీ రూ.18.25 లక్షల కోట్లు ఉండగా.. 2028-29 నాటికి రూ.29.29 లక్షల కోట్లకు చేరుకోవాలనేది టార్గెట్. ఇది సాకారం కావాలంటే 2029 నాటికి రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు రావలసిన అవసరం ఉంది.
విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనానికి కారణమైంది.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014-19 మధ్య 13.49 శాతం సరాసరి వృద్ధి ఉంటే.. 2019-24 మధ్య 10.32 శాతానికి పడిపోయింది.
ముఖ్యమైన రాష్ట్రాలతో పోల్చుకుంటే జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువ(6.48ు)గా ఉంది. తెలంగాణలో 9.51, కేరళలో 8.49, మహారాష్ట్రలో 7.93 శాతంగా ఉంది.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా.. విభజన చట్టం షెడ్యూల్-9 ప్రకారం 91 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి రూ.1.63 లక్షల కోట్లు, షెడ్యూల్-10 కింద ఉన్న 142 సంస్థలకు చెందిన రూ.39,191 కోట్ల ఆస్తుల పంపకం అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
రాష్ట్రానికి సొంతంగా వచ్చే ఆదాయం కంటే వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, జీతాలు.. ఇలా కచ్చితంగా చేయాల్సిన ఖర్చే ఎక్కువ. 2023-24లో కచ్చితంగా చేయాల్సిన ఖర్చులు రూ.1,03,022 కోట్లు ఉంటే.. సొంత ఆదాయం రూ.93,410 కోట్లు మాత్రమే.
2024 జూన్ నాటికి రాష్ట్రం అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. దీనికి తోడు పెండింగ్ బిల్లులు రూ.1.35 లక్షల కోట్లు ఉన్నాయి. మూలధన వ్యయమూ తగ్గిపోయింది.
వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని పనగారియా, కమిషన్ సభ్యులు ప్రశంసించారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా అని పనగారియా అడిగారు. ఇంకా లేదని.. వచ్చే నెలలో భేటీ సందర్భంగా వివరిస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరం గురించి ఆర్థిక సంఘ సభ్యురాలు అన్నే జార్జ్ మాథ్యూ ప్రస్తావించారు. 30 ఏళ్ల నాటికి, నేటికీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇదంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని చెప్పారు. అమరావతిని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు అమరావతికి చేరువలో ఉన్నాయి. ఈ 4 నగరాలను కలుపుతూ దక్షిణ భారతం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతుంది.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను.. అత్యున్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది సంపన్నులు ఆదుకునే పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
- సీఎం చంద్రబాబు
Read Also: Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్
ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు